Showing posts with label తుమ్మల సీతారామమూర్తి చౌదరి. Show all posts
Showing posts with label తుమ్మల సీతారామమూర్తి చౌదరి. Show all posts

Monday, December 27, 2010

తుమ్మల సీతారామమూర్తి చౌదరి,Tummala Sitaramamurty chowdary


తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవలను ప్రస్తుతిస్తూ, ఘన సన్మానం చేసి 'అభినవ తిక్కన' అనే బిరుదును ఇస్తే, వినయపూర్వకంగా, తాను తిక్కన అంత ఘనుణ్ణికాదని, 'తెలుగు భాషకు సేవకుడను' అనే అర్థం వచ్చేలా 'తెనుగు లెంక' అని పేరు పెట్టుకున్న మహాకవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి. ఇరవై నాలుగు వేల పద్యాలు వ్రాసినా, విద్యార్థులకు ఆయన రచనలను పాఠ్యాంశాలుగా నిర్ణయించకపోవడంతో ఆయన సాహిత్యం నిరాదరణకు గురవుతున్నది.

ఏ అభ్యుదయ కవికీ, విప్ల వ కవికీ తీసిపోని భావాలను తెనుగులెంక ఎన్నడో తన కవితల్లో వ్యక్తీకరిం చి వున్నారు. గుంటూరు జిల్లా కావూరులో 1901 డిసెంబర్ 25న సీతారామమూర్తి జన్మించారు. చెంచమ్మ, నారయ్యలు తలిదండ్రులు. నిజాయితీగల రైతు కుటుంబంగా వాసికెక్కిన ఇంట జన్మించిన ఈ కవి జీవితంలో నూ, కవితలోనూ నిజాయితీకే ప్రాముఖ్యం ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు.

తుమ్మల వారు గాంధీ కవి. ఆత్మకథ, మహాత్మకథ, అమరజ్యోతి, సర్వోదయగానము, గాంధీ గానము, మహాత్మాగాంధీ తారావళి తుమ్మల రచించిన గాంధీ కావ్యాలు. గాంధీ తత్త్వం, సర్వోదయం ఆయన జీవితంతో ముడివేసుకున్న అంశాలు. తుమ్మల వారు 'మహాత్ముని ఆస్థాన కవి' అని కట్టమంచి రామలింగారెడ్డి ప్రశంసించారు. కవిత్వాన్నే గాక తన జీవితాన్ని గూడా గాంధీ మార్గంలో నడిపిన కవి తుమ్మల. తెలుగుదనం అంటే ఆయ న ఒడలు పులకరించిపోతుంది.

స్వాభిమానం మెండు. రాష్ట్రగానం, ఉదయగానం ఆనాడు ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూపిన కావ్యాలు. రైతు కుటుంబంలో పుట్టి, ఒక పూట పొలానికి, ఒక పూట బడికి పోయిన తుమ్మల కవిత్వంలో 'రైతు' తొంగి చూస్తుంటాడు. పరిగపంట, పెద్దకాపు, శబల, పైరపంట, సమదర్శి, కదంబకైత, దివ్యజ్యోతి తుమ్మలవారి ఖండ కావ్యాలు. ఆత్మార్పణము, ధర్మజ్యోతి వీరి కథా కావ్యాలు. ఇంకా పెక్కు సామాజిక కావ్యాలు, శతకాలు, నాటకాలు, హరికథలు, చరిత్రములను తుమ్మల రచించారు.

రైతు జీవితానికి కావ్య గౌరవం కల్పించి, తెలుగు నుడికారానికి ప్రాణంపోసి, తెనుగుదనానికి నిర్వచనంగా నిలిచిన తుమ్మలను కొంగర జగ్గయ్య 'కళా తపస్వి'గా సంభావించాడు. 'వాస్తవిక జగత్తుకు కాల్పనిక ప్రతిబింబమే కావ్యజగత్తు అన్న నిజాన్ని సీతారామమూర్తిగారు తమ రచనల ద్వారా నిరూపించార'ని తెనుగులెంక శతజయంతి సందర్భంగా తమ నమోవాకాలు సమర్పించాడు.

తెలుగు జాతినీ, దేశాన్ని తలుచుకుంటే చాలు తుమ్మలవారి కన్నులు ఆణిముత్యాలవుతాయి. గమగమలాడే పైర వంకాయకూర, ముదురు గుమ్మడి పండు ముదురు పులుసూ, జిడ్డుదేరిన గడ్డ పెరుగూ వుంటే.. ఇంకేం కావాలి? తెలుగునాటి భోగభాగ్యాలకూ, సరస సల్లాపాలనూ, కన్నులకు కట్టేట్లు, నోరూరేలా తెనుగులెంక వర్ణించాడు. నేటి ఆంధ్రులు అనుభవిస్తున్న దైన్యాన్ని తలుచుకొని, తల్లి నాదుకోలేని తెలుగు బిడ్డ బ్రతుకు బరువు చేటు అని వాపోయాడు.

తుమ్మల కుప్పలు నూర్చాడు. గడ్డి పీకాడు. వెంటి కట్టాడు. పది మోపుల గడ్డి పనలను ఒక్కడే నెత్తిన పెట్టుకున్నాడు. వ్యవసాయం చేసినన్నాళ్లు శరీరం సౌష్ఠవంగా వుంది. బండి చక్రం ఊబిలో దిగబడితే గిత్తలు లాగలేకపోయాయి. తుమ్మల బండి కాడిని తన మెడమీద వేసుకొని బండి ని బయటకు లాగగలిగాడు. చదువుకున్నా డు కాబట్టి ఉపాధ్యా య వృత్తి లోకిపోయా డు. 'పంచదార అనుకొని చేదు మెక్కానే' అని తుమ్మల బాధపడుతూ' 'ఒక మర కైవ డిం గదలుచున్న యెడల్ కురిబీకి దత్తమైనది' అన్నాడు.

విశ్వనాథ సత్యనారాయణ ఇలా అంటాడు-'ఓయి నాగరకులారా! కృషీవల జీవన విముఖులారా! ఈ మహాకవిని వినుడు! నాగరికతా భ్రాంతిని వదిలించుకొనుడు!' ఇదే తుమ్మలవారి సందేశం అని కూడా మనం భావించవచ్చు. ఆయన్ని చూస్తే అచ్చం తెలుగు రైతులాగా వుండేవాడు కాని 'కవి వేషం' కనబడేది కాదు. ఆరడుగుల నల్లని విగ్రహం. పల్లెటూరి పెద్దరికం తొణికసలాడే నుదురు.

పొడుగైన ముక్కు. గుబురైన మీసాలు. ఖద్దరు దుస్తులు. ఆచితూచి మాటలు. సద్గుణాల ప్రోగు. ఆయన ఒక విషయంలో మాత్రం గర్వి ష్ఠి! తాను తెలుగు వాడైనందుకు ఆయన గర్విస్తాడు. తెలుగుజోదుల తుటారి కటారి చెలరేగి పగర చీల్చిన దినాన్ని జ్ఞప్తి చేసుకొని, పారతంత్య్రానికి, కులతత్వాలకు, ఈర్ష్యకులోనై, కుక్కలు చింపిన విస్తరిగా దేశాన్ని చేసిన ఆంధ్రజాతిని ఈసడించుకున్నాడు. రాష్ట్ర సిద్ధి కోసం 'రాష్ట్ర గానం' రచించి, రాష్ట్ర వృద్ధికోసం 'ఉదయగానం' ఆవిష్కరించాడు తుమ్మల.

పదవుల కోసం కుమ్ములాటను గాంచి కవి మనసు కలత చెందింది. ఇలా అంటాడు.'దొడ్డ తలపులున్న రెడ్డికైనను మాల/బిడ్డకైన నిమ్ము పెత్తనమ్ము కులము లింక నిల్వగలవటోయీ! వేరు/ పరువు పడియె, వాని పరువు సెడియె' 'బిచ్చగాడు లేని, మ్రుచ్చులేని, కటారిలేని, దొర తనమ్ములేని కుట్రలేని' దేశపరిస్థితుల కోసం కవి ఎదురుచూశాడు. నిజంగా అటువంటి రోజువస్తే అదే 'క్రొత్త సంక్రాంతి' కవికి. నేటి రచయితలకు 'పునాది తక్కువ' అని వారి నిశ్చితాభిప్రాయం.

ఒక ఇంటర్వ్యూలో తుమ్మల ఇలా అన్నారు.'నా రచన పద్యము. దీనికి వ్యవహారిక భాష సాయపడదు. గణము కోసమో యతి ప్రాసల కోసమో సలక్షణ భాషనాశ్రయింపక తప్పదు. వచనము గేయము ఆధారముగా చేసుకొని యువ కవులు వ్యవహారిక భాషలో కవిత్వము వ్రాయుచున్నారు. వీరిలో శ్రీశ్రీ వంటి సిద్ధహస్తులు కొందరున్నారు. భాషా మార్గము ఏదైనను రచయిత లోతుగా సాహిత్య కృషి చేసినపుడే పది కాలాల పాటు అది చరిత్రలో నిలుచును. మా తరం వారు చదివినంత గట్టిగా నేటి యువతరం కావ్య పఠనం చేయడం లేదు. పత్రికల నిండా ఏదో రాస్తున్నారు.

చాలా మంది పలుకులలో ప్రాణం లేదు. పునాది తక్కువ. తనదంతా విప్లవ కవిత్వం అని ఆయన భావన. తమతరం కవుల్లో శృంగారం జోలికి వెళ్లని వారిలో తుమ్మల మొదట నిలుస్తాడు. ఆయన రచన చేయడం ప్రారంభించాక భావ కవిత్వం వచ్చింది. తుమ్మల మనసు దాని మీదకు పోలేదు. తరువాత అభ్యుదయ, విప్లవ కవిత్వాలు వచ్చాయి. వాటి పద్ధతి తుమ్మల చూశాడు. అప్పటికి తుమ్మల రాసిందంతా విప్లవ కవిత్వమే! కాకపోతే ఒక తేడా ఉంది. తుమ్మల విప్లవం అంతా అహింసాయుతం. తుమ్మల సీతారామమూర్తి స్వగృహంలోనే 1990 మార్చి 21న పరమపదించారు
-శ్రీరామ్
(నేడు-25/December తుమ్మల సీతారామమూర్తి జయంతి)

Source : Wikipedia.oga ->Tummala Sitaramamurty

  • ==================================
Visit My website - > Dr.Seshagirirao