తెలుగు భాషకు ‘నుడి-నానుడి’-తిరుమల రామచంద్ర.తెలుగు సాహిత్యం, పత్రికారంగాలలో ప్రాతః స్మరణీయుడు . ప్రాకృత, సంస్కృతాం ధ్ర సారస్వతాల్లో నిష్ణాతునిగా, ద్రావిడ భాషల పరిశోధకునిగా విశిష్ట సేవలందించారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, మద్రాసు కుట్రకేసులో ముద్దాయిగా స్వాతంత్య్ర సమరంలో పాలుపంచుకున్నారు.
అనంతపురం జిల్లా ధర్మవరం తాలుకా రాఘవంపల్లెలో జన్మించిన రామచంద్ర తెలుగు సంస్కృతాలలో ‘విద్వాన్’గా, హిందీలో ‘ప్రభాకర’గా పట్టాలు పొందారు. తిరుపతిలో చదువుతున్నపుడు వ్యష్టి సత్యాగ్రహంలో పాలొని, ఏడాది జైలు శిక్ష అనుభవించారు. సహాయ నిరాకరణ సభల కోసం మార్చింగ్ సాంగ్స్ రాశారు.
వేటూరి ప్రభాకరశాస్ర్తి గారికి ఏకలవ్య శిష్యుణ్ని అని చెప్పుకునే తిరుమల రామచంద్ర గారు విద్వాన్ విశ్వం వంటి సహాధ్యాయులతో పని చేశారు. ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తాగా అఫ్ఘానిస్థాన్, బెలూచిస్థాన్ సరిహద్దుల్లో పనిచేశారు. అనంతరం ఢిల్లీ వచ్చి ‘డెయిలీ టెలిగ్రాఫ్’ ఆంగ్లపత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డారు. 1944లో తెలుగు పత్రికారంగంలో ప్రవేశించారు. తొలుత ‘తెలంగాణ’ పత్రికలో చేరారు. తర్వాత ‘మీజాన్’లో చేరి, ఆ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు శిష్యరికంలో రాటుదేలారు.
ఆ రోజు ల్లోనే సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల దంపతులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సోషలిస్టు భావజాలానికి దగ్గరయ్యారు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలలో వివిధ హోదాల్లో పని చేశారు. ‘భారతి’ మాసపత్రిక ఇన్‌చార్జి ఎడిటర్‌గా పనిచేసిన కాలంలో దేవరకొండ బాలగంగాధర తిలక్ కథ ప్రచురించిన కారణంగా తలెత్తిన భేదాభిప్రాయాలతో రాజీనామా చేశారు. నార్లతో విభేదించి ఆంధ్రప్రభలోనూ ఉద్యోగం వదులుకున్నారు.
పదమూడో ఏట ఓ శృంగార రచన చేసినా మానవల్లి రామకృష్ణ కవి మందలింపుతో దేశభక్తి గీతాల వైపు మళ్లారు రామచంద్ర. కొన్ని వందల వ్యాసాలు, సమీక్షలు రాశారు. ‘హైదరాబాద్ నోట్‌బుక్’ వంటి దాదాపు 15 శీర్షికలు నిర్వహించారు. ‘సత్యాగ్రహ విజయం’ నాటకం, రణన్నినాద గీతాన్ని సంస్కృతంలో రాశారు. ఆయనకు ఎనలేని కీర్తిని ఆర్జించిపెట్టిన పుస్తకాలు ‘మన లిపి: పుట్టుపూర్వోత్తరాలు’, ‘నుడి-నానుడి’, ‘సాహితీ సుగతుని స్వగతం’, ‘గాథాసప్తశతిలో తెలుగు పదాలు’ ‘తెలుగు పత్రికల సాహిత్య చరిత్ర’.
ఇందులో ‘సాహితీ సుగతుని స్వగతం’ గ్రంథానికి 1970లోనూ రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ సాహిత్య విమర్శ పురస్కారం,‘గాథాసప్తశతిలో తెలుగుపదాలు’కు 1986లో రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచే అవార్డు లభించాయి. రెండు వేల ఏళ్లనాటి భారతీయుల సాంఘిక జీవనాన్ని కమనీయంగా వ్యాఖ్యానించడమేగాక, గాథాసప్తశతిలో ఏయే సందర్భాల్లో, ఏయే అర్థాల్లో తెలుగు పదాలు కనబడతాయో వివరించారు. కాళిదాసుపై గాథాసప్తశతి ప్రభావం ఉందని తేల్చిచెప్పారు.
లాహోర్ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో ఏడాదిపాటు పనిచేసి తెలుగు, కన్నడ, తమిళ, మళయాల తాళపత్ర గ్రంథాలు వెయ్యింటికి వివరణ సూచీ తయారు చేశారు. ఆ లైబ్రరీలోని దాశరధి తంత్రం అనే తెలుగు తాళపత్ర గ్రంథాన్ని ప్రపంచానికి అందాయి. ఆయన ప్రకటించిన ‘లలిత విస్తరం’ బౌద్ధ వాజ్మయం నుంచి ఆధునిక భారతీయ భాషలలో తొలి అనువాదం. మహాయాన బౌద్ధ సంప్రదాయానుసారం రాసిన బుద్ధుని జీవిత చరిత్ర ఇది.
భారతదేశంలో మొట్టమొదటి లౌకిక వచనంగా దీన్ని పేర్కొన్నారు. క్షేమేంద్రుడి ‘అవధాన కల్పలత’ను కూడా ఆయన అనువదించారు. తెలుగులో వీరిదే తొలి అనువాదం. కేవీ అయ్యర్ రచించిన ‘శాంతల’, శివరామకారంత్ ‘అళిదమేలె’, కమలనయన బజాజ్ ‘ఫ్రాంటియర్ గాంధీ ఇన్ కాబూల్’ గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ఆయన ఆధ్వర్యంలో వెలువడిన ‘పరిశోధన’ పత్రిక ప్రతి సంచికను ఒక ప్రత్యేక సంచికగా వెలువరించారు. తెలుగు నుడికి బడికట్టి, మన అక్షర రమ్యతను జగతికి చాటిన పరిశోధన ‘రాముడు’, సారస్వత ‘చంద్రుడు’ తిరుమల రామచంద్ర.
ముత్యాల ప్రసాద్ విజయవాడ . అక్టోబరు 12 తిరుమల రామచంద్ర 13వ వర్ధంతి.
awards :
న్యూఢిల్లీ శనివారం, డిసెంబర్ 22, 2001: ప్రముఖ సాహితీవేత్త దివంగత తిరుమల రామచంద్ర పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
ఆయన రాసిన ఆత్మకథ హంపీ నుంచి హరప్పా దాకా అనే పుస్తకానికి ఈ అవార్డు లభించింది.తిరుమల రామచంద్ర నిరుడు స్వర్గస్థులయ్యారు. ఆయన తన హంపీ నుంచి హరప్పా దాకా అనే పుస్తకాన్ని కేవలం ఆత్మకథగానే రాయలేదు. ఈ పుస్తకంలో సాంఘిక పరిస్థితులకు, వందేళ్ల సాహితీ చరిత్రకు అద్దం పట్టారు.
- =============================================