పూర్తి పాఠముకోసము - > అన్నమయ్య
తాళ్ళపాక అన్నమాచార్యులు కారణ జన్ములు. దైవాంశ సంభూతుడైన ఈయన రచించిన పద కవితలన్నీ అక్షరాక్షరాన అనంత దైవశక్తిని నింపుకొని ఉన్నట్టు కనిపిస్తాయి. దీన్ని సమర్థిస్తూ ఆయన జీవితంలో జరిగిన ఎన్నెన్నో సంఘటనలను మనకు ఎరుక పరుస్తోంది తాళ్ళపాక చిన్నన్న రచించిన అన్నమాచార్య చరిత్ర అనే ద్విపద కావ్యం. చిన్నన్న అసలు పేరు తాళ్ళపాక చిన్న తిరువేంగళనాధుడు. ఈయన అన్నమయ్య కుమారుడైన పెద తిరుమలాచార్యుడి నాలుగో కుమారుడు. అందరూ చిన్నన్న అని అంటుండేవారు. ఈయన రచనా శైలిని, రచనలోని విశేషాలను ఆనాడు తెనాలి రామకృష్ణుడంతటి వాడు కూడా ప్రస్తుతించాడు. అన్నమాచార్య చరిత్ర అనే ద్విపద కావ్యం ఆధారంగా చూస్తే ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే పొలానికి గడ్డి కోసుకు రావటానికి వెళ్ళి అటు నుంచి అటే తిరుమలకు వెళ్ళే యాత్రికులతో కలిసి శ్రీవేంకటేశుడి దగ్గరకు బయలుదేరాడు. అన్నమయ్య కొండ ఎక్కుతూ పల్లవరాయుని మఠం, కర్పూరపు కాలువ దాటాక మోకాళ్ళ పర్వతం చేరే సరికి బాగా అలసిపోయాడు. మధ్యాహ్నం వేళ ఓ పొద కింద ఆకలి, నీరసంతో సొమ్మసిల్లిన ఆ బాలుడిని సాక్షాత్తు అమ్మవారే ఓ పెద్ద ముత్త్తెదువు రూపంలో వచ్చి సేద తీర్చి, తాను వెంకటేశ్వరస్వామి ఆరగించే ప్రసాదానాన్ని పెట్టింది. అప్పటిదాకా అన్నమయ్య కాళ్ళకు చెప్పులను తొడుక్కునే కొండ నెక్కటం చూసి తిరుమలను చెప్పుల కాళ్ళతో ఎక్కకూడదని చెప్పి కోనేటి రాయుడు ఎటు వెళ్తే కనిపిస్తాడో చెప్పి అంతర్థానమైంది. అలా అలవేలుమంగ చేతుల్లో లాలన పొందిన పుణ్యాత్ముడు ఈయన. అమ్మ కనిపించి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర శతకాన్ని రచించాడు. అయితే దానిలో ఉన్న విషయం మాత్రం అలవేలు మంగ గురించే. అందుకే ఆ శతకాన్ని పండిత లోకం మంగాబికా శతకం అని కూడా అంటుంది. అక్కడి నుంచి మెల్లగా తిరుమల చేరిన ఆ బాల అన్నమయ్య సర్వ పురాణాలు పేర్కొంటున్న విధంగానే ముందుగా సర్వపాపాలనూ పోగొట్టే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆ చెంతనే ఉన్న వరాహ స్వామిని దర్శించుకున్నాడు. అనంతరం పెద గోపురానికి నీడ తరగని చింత చెట్టుకు భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే గరుడ కంబానికి నమస్కరించాడు. అన్నమయ్య తల్లిదండ్రులు కూడా తిరుమల వచ్చి ఈ గరుడ కంబానికి సాగిలపడి మొక్కిన తర్వాతనే కలలో స్వామి అనుగ్రహించటం, అన్నమయ్య జన్మించటం జరిగాయి. అనంతరం శ్రీ వేంకటేశుడిని దర్శించి నమస్కరించుకొన్నాడు. పరిసరాలలో ఉన్న నరసింహస్వామి లాంటి దేవతలనందరినీ దర్శించుకొని కల్యాణ మండపాన్ని, బంగారు గరుడ అశ్వశేష వాహనాలను భక్తి తత్పరతతో చూసి మైమరిచాడు. ఆ వాహనాలను అన్నింటినీ కీర్తించాడు. తన పంచె కొంగులో దాచుకొన్న ఒక కాసును తీసి అక్కడున్న బంగారు గాదెకు నమస్కరించి స్వామికి సమర్పించాడు. అలాగే తిరుమలలో ఉన్న కుమారధార తీర్థం, ఆకాశగంగ, పాపవినాశనం, ఇలాంటి తీర్థాలన్నింటినీ సేవించుకొన్నాడు. అర్చకుల వెంట తిరుగుతూ ఆలయంలో ఉన్న వివిధ దేవతామూర్తులను దర్శించుకొన్నాడు. స్వామివారి ప్రసాదంతోనే పొట్టనింపుకొని నారాయణ నామస్మరణంతో కాలం గడిపాడు.
కోరి కోరి తన చెంతకొచ్చిన అన్నమయ్యను స్వామి తానే స్వయంగా ఆదరించాడు. వైష్ణవమత స్వీకారానికి కావలసిన ఏర్పాట్లను వెంకటేశుడే చేయడం విశేషం. ఆ రోజుల్లో తిరుమలలో ఘన విష్ణువు అనే వైష్ణవమత ప్రబోధకుడైన ఆచార్యుడుండేవాడు. మహాభక్తుడైన ఆ ఆచార్యుడి కలలో స్వామి కనిపించి అన్నమయ్య అనే బాలుడు తిరుమలకొచ్చాడని అతడికి పంచ సంస్కార దీక్ష నివ్వమని చెప్పి శంఖ, చక్ర ముద్రికలను కూడా ఘనవిష్ణువుకిచ్చి అంతర్థానమయ్యాడు వేంకటేశుడు. మరుసటి ఉదయం ఘనవిష్ణువు కలలో స్వామి చెప్పిన గుర్తులను పోల్చుకుంటూ అన్నమయ్యను చేరుకొన్నాడు. వైష్ణవం ప్రకారం పంచసంస్కార దీక్షనిచ్చాడు. పంచ సంస్కారాలలో తాపం మొదటిది. దీని ప్రకారం రెండుభుజాల మీద ముద్రికల ధారణ జరుగుతుంది. రెండోది పుండ్రం. అంటే ముఖము, భుజాలు, వక్షస్థలం లాంటి ప్రదేశాలలో ద్వాదశ ఊర్ధ్వ పుండ్రాలను ధరిస్తారు. మూడోది నామం. దీని ప్రకారం ఒక ప్రత్యేకమైన పేరు నివ్వటం జరుగుతుంది. నాలుగోది మంత్రం. అంటే స్వామి వారి మంత్రోపదేశం జరుగుతుంది. అయిదోది యాగం అంటే భగవంతుడి ఆరాధన. ఇలా ఈ అయిదు సంస్కారాల దీక్షను ఘనవిష్ణువు అన్నమయ్యకిచ్చాడు. ఈ దీక్ష తర్వాతే అన్నమయ్య అన్నమాచార్యుడు అయ్యాడు. ఈ దీక్షలో తరిస్తూ నిరంతరం స్వామి మీద పద కవితలను రచిస్తూ కాలం గడపసాగాడు అన్నమయ్య
కన్నబిడ్డ కనిపించకుండా పోవటంతో తాళ్ళపాకలో కన్నవారి బాధ భరించరానిదైంది. అయితే వేంకటేశుడే అన్నమయ్య ఎక్కడున్నదీ చెప్పటంతో తిరుమలకొచ్చిన ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను చూసి మురిసిపోయారు. కానీ ఇంటికి రమ్మనమని కోరినప్పుడు వ్యతిరేక సమాధానం రావటంతో తల్లి మనస్సు మళ్ళీ బాధ పడింది. అయితే ఆ రోజు రాత్రి వేంకటేశుడు. అన్మమాచార్యుడికి కలలో కనిపించి ఇంటికి వెళ్ళమని ఆదేశించటంతో తిరిగి తాళ్ళపాకకు చేరాడు. సంసార బంధనాలు ఇష్టం లేకపోయినా దైవ ప్రేరణతోనే గృహస్థుడయ్యాడు. అయినా తన పదకవితా రచన దీక్షను విడువలేదు. ఆ రోజుల్లో సాళువ నరసింహరాయులు రాజ్యమేలుతుండేవాడు. ఆయనకు అన్నమాచార్యుడి పద కవితల గొప్పదనం తెలిసి తన దగ్గరకు ఆహ్వానించాడు. అన్నమయ్య కూడా రాజాశ్రయం ఉంటే పద కవితల భక్తి ప్రచారానికి మరింత మేలు కలుగుతుందనుకుని ఆయన దగ్గరకు వెళ్ళాడు. రాచమర్యాదలన్నీ బాగానే లభించాయి. కానీ ఓ రోజున నిండు సభలో గానం చేసిన 'ఏమొకో చిగురుట ధరమున యెడనెడగస్తూరి చిందెను...' అనే పద కవితను అన్నమయ్య ఆలపించినప్పుడు తనమీద కూడా అలాంటి పద కవితనే చెప్పమన్నాడు రాజు. హరి హరీ అంటూ చెవులు మూసుకుని తాను స్వామి మీద తప్ప వేరొకరి మీద కవిత్వం చెప్పనన్నాడు అన్నమయ్య. వెంటనే సంకెలలు వేయించి చెరలో పెట్టించాడు రాజు. అప్పుడు అన్నమాచార్యుడు 'ఆకటి వేళలను నలపైన వేళలను, తేకువ హరినామమే దిక్కు మరి లేదు...' అని సంకీర్తించాడు. సంకెళ్ళు క్షణాల్లో విడిపోయాయి. ఈ విషయాన్ని భటులు రాజుకు చెప్పారు. రాజు దగ్గరుండి మరీ సంకెళ్ళు వేయించాడు. ఈసారి 'నీ దాసుల భంగములు నీవు చూతువా, యేదని చూచేవు నీకు నెచ్చరించ వలెనా...' అని మళ్ళీ ఆర్తితో కీర్తించాడు. సంకెళ్ళు ఊడిపోయాయి. రాజుకు జ్ఞానోదయమై క్షమించమన్నాడు. క్షమించిన అన్నమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అన్నమయ్య పదకవితలు, సంకీర్తనలు అన్నీ ఇలా మంత్రశక్తి ప్రపూరితాలే నంటారు పెద్దలు. వేంకటేశ్వరుడి ముద్దు బిడ్డడు, వరప్రసాది అయి భగవతత్వాన్ని చాటిచెబుతూ కలియుగ దైవం ఉనికిని ఎరుకపరచిన ఘనుడు కనుకనే అన్నమాచార్యుడు ఈనాటికే కాదూ ఏనాటికైనా పూజలందుకుంటూనే ఉంటాడు.
-డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు
- ======================================
No comments:
Post a Comment