గృహిణిగా.. ఇద్దరు పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూ మానసిక నిపుణురాలిగా పనిచేస్తోంది అమిత పియూష్ మోత్వాని. ఎనిమిదేళ్ల నుంచి హైదరాబాద్‌లో చిన్నారుల కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలతో కలిసి నడుస్తోంది. విద్యార్థులకు వ్యక్తిత్వపాఠాలు చెబుతూ, వారి చదువుకీ ఆరోగ్యానికీ తన సంపాదనను వెచ్చిస్తోంది అమిత. గత నెల్లో అట్లాంటాలో జరిగిన 'మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్' పోటీల్లో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి వందల మంది పోటీదారులను వెనక్కి నెట్టి కిరీటాన్ని గెలుచుకుంది.
మా నాన్న ప్రొఫెసర్. అమ్మ కూడా బాగా చదువుకుంది. చదువులో వారే నాకు ఆదర్శం. చిన్నప్పట్నుంచీ నాకు వైద్య వృత్తి అంటే గౌరవం. పెద్దయ్యాక న్యూరో సర్జన్ అవ్వాలని కలలు కనేదాన్ని. అయితే నా పదో తరగతి పూర్తయ్యేప్పటికి మా అమ్మానాన్నలు విదేశాలకు వెళ్లారు. దాంతో నేను ఇండోర్‌లోని అమ్మమ్మ దగ్గర ఉండి ఇంటర్ చదువుకున్నా. అక్కడ కాలేజీలో చేరాక మోడలింగ్ చేయాలనీ, ర్యాంపు మీద నడిచి శభాష్ అనిపించుకోవాలనీ కోరిక కలిగింది. ఓసారి కాలేజీలో ఫ్యాషన్ పోటీ జరుగుతుంటే సరదాగా పాల్గొన్నా. ఆశ్చర్యంగా, మొదటి బహుమతి నాకే వచ్చింది. ఉత్సాహంతో రాష్ట్ర స్థాయి అందాల పోటీల్లో పాల్గొన్నా. 'మిస్ మధ్యప్రదేశ్'గా ఎంపికయ్యా. ఈ గెలుపు నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. పోటీల కోసం నేనెలాంటి సాధనా చేయలేదు. నాజూగ్గా ఉండటమే ప్లస్ పాయింట్ అయింది. అయితే మోడలింగ్‌లో పడి, నేను చదువును పక్కన పెట్టేస్తానేమోనని అమ్మానాన్నలు అనుకున్నారు. కానీ ప్రతి పరీక్షలో... ఇంటర్, డిగ్రీలో మంచి మార్కులతో పాసయ్యా. ఇంగ్లిష్ మీద ఇష్టంతో ఎమ్మే చేశా. తరవాత ఎంబీయే హెచ్‌ఆర్ పూర్తి చేశా. ఎదిగే కొద్దీ ఆసక్తులు మారాయి. రకరకాల ప్రభావాల కారణంగా వైద్య విద్య చదవలేకపోయా. మానసిక శాస్త్రంలో పట్టా తీసుకున్నా.
సంపాదిస్తూ సేవ చేస్తూ: నాది ప్రేమ వివాహం. 2002లో పీయూష్‌తో నా పెళ్లయింది. తను హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ బ్యాంకులో ఉన్నతోద్యోగి. నేనూ ఖాళీగా ఉండకుండా జనహిత, మరికొన్ని స్వచ్ఛంద సంస్థల్లో సభ్యత్వం తీసుకున్నా. దానికీ కారణం ఉంది. నేను సైకాలజీ చదివేప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశా. పిల్లలను బడికి పంపించనీ... పుట్టుకతోనే అనారోగ్యంతో జన్మించిన పసి కందులకు ఎక్కడ వైద్యం చేయించాలో తెలియక వాళ్లని అలానే వదిలేసిన తల్లిదండ్రులనీ చూశా. కారణం నిరక్షరాస్యత. వివిధ సమస్యలతో నా దగ్గరికొచ్చే వారినీ చూస్తా కదా! కొంతమంది సంపాదన మీద దృష్టి పెడుతున్నారు తప్ప పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు గురించి అంతగా ఆలోచించకపోవడం నేను గమనించా. అందుకే పెద్దవాళ్లకు ఈ విషయాలపై అవగాహన కల్పించి, చిన్నారులు బడిలో చేరి చదువుకునేలా ప్రోత్సహించాలనుకున్నా. మానసిక నిపుణురాలిగా నాకొచ్చే ఆదాయాన్ని అందుకోసం వెచ్చించడం మొదలుపెట్టా. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ప్రతివారం వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పడం, అనారోగ్యంతో బాధ పడే పిల్లలకు వైద్యం చేయించడం చేస్తున్నా. అలాగని ఫ్యాషన్ ప్రదర్శనలకు దూరమవలేదు. మా అత్తగారిది ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో ప్రతి ఒక్కరూ నన్ను ప్రోత్సహించారు కాబట్టే ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాక కూడా అందాల పోటీల్లో పాల్గొనగలిగా. 'మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్' పోటీలకు నేను చివరిగా దరఖాస్తు చేశా. ఆ సమయంలో మా అత్తగారూ, మా వారూ పిల్లల్ని చూసుకున్నారు. పోటీల్లో పాల్గొనడానికి ప్రత్యేకంగా శిక్షణంటూ ఏమీ తీసుకోలేదు. రోజూ ఏరోబిక్స్ చేస్తూ, ఎక్కువగా నీళ్లు తాగుతూ, అందానికి సహజ పదార్థాలు వాడుతూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నానంతే.
courtesy with : vasundara@eenadu news paper-07/11/2013
- ========================
No comments:
Post a Comment