జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో పుట్టిన క్రీడా కుసుమం ..ఆమె పోటీలో అడుగుపెట్టిందంటే చాలు.. పతకం దక్కాల్సిందే.. అది జాతీయ క్రీడలైన, అంతర్జాతీయ క్రీడలైనా.. ఆమెకు సునాయసమే. ఆమె ఎవరో కాదు... నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన మత్స సంతోషి.. 20వ కామనె్వల్త్ క్రీడల్లో మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 53 కిలోల విభాగంలో పాల్గొని కాంస్యం దక్కించుకొని దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. దీంతో జిల్లా అంతటా ఆమె అభిమానులు, నేతలు ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. శనివారం మంత్రి మృణాళిని ఆ గ్రామానికి వెళ్లి సంతోషి తల్లిదండ్రులతో కాసేపు ముచ్చటించారు. పేదరికంలో పుట్టినప్పటికీ సాహసమే ఊపిరిగా ఎదిగింది. కోచ్ చల్లా రాము సూచనలతో ముందడుగు వేసింది. ఆమె సాధించిన పతకాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. 2005 నుంచి పలు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బంగారు పతకాలను సాధించింది. 2006-13 వరకు జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జూనియర్ విభాగంలో పలుమార్లు బంగారు పతకాలను సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. 2010లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఏషియాడ్‌లో బంగారు పతకాన్ని సాధించింది. అదే ఏడాది సింగపూర్‌లో జరిగిన యూత్ ఒలింపియాడ్‌లో ఐదో స్థానం దక్కించుకుంది. మలేషియాలోని కామన్‌వెల్త్ యూత్ జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. 2011లో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. 2012లో మలేషియాలో జరిగిన జూనియర్ విభాగంలో బంగారు పతకం దక్కించుకుంది. ఇక జాతీయ స్థాయి క్రీడా వేదికలలో అనేకమార్లు బంగారు పతకాలను కైవశం చేసుకుంది. ఈ విధంగా సంతోషి గత పదేళ్లుగా కొండవెలగాడ గ్రామం పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎటువంటి సందేహం లేదు.
స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో దేశం నుంచి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన తెలుగు తేజం మత్స సంతోషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పోటీల్లో 53 కిలోల విభాగంలో దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన సంతోషి క్లీన్ అండ్ జర్క్‌లో 105 కేజీలు, స్నాచ్ లో 83 కేజీలు బరువులు ఎత్తి కాంస్య పతకం దక్కించుకు న్న విషయం విదితమే. సంతోషి సాధించిన ఘనత ద్వారా జిల్లా ఖ్యాతి ఎల్లలు దాటాయని పలు క్రీడాసంఘాలు అభినందనలు వ్యక్తం చేస్తున్నాయి. సంతోషికి అభినందనలు తెలిపిన వారిలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె. మనోహర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు దన్నాన తిరుపతిరావు, వల్లూరి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు వల్లూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సముద్రాల గురుప్రసాద్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన సాధూరావు, కార్యదర్శి అట్టాడ లక్ష్మున్నాయుడుతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతి నిధులు, క్రీడాభిమానులు ఉన్నారు.
వ్యాయూమశాల పూర్తికి నిధులిస్తాం..
వెయిట్ లిఫ్టింగ్ క్రీడకు పుట్టినిల్లయిన కొండ వెలగాడలో నిర్మాణంలో ఉన్న వ్యాయామశాలను పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేస్తామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హామీనిచ్చారు. కామన్వెల్త్ క్రీడల్లో గ్రామానికి చెందిన మత్స సంతోషి కాంస్య పతకం సాధించిన సందర్భంగా ఆమె తల్లిదండ్రులు రాములమ్మ, రామారావులను కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం సత్కరించారు. కొండవెలగాడలోని సంతోషి స్వగృహానికి చేరుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కొండవెలగాడలోని వ్యాయామశాల నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో సంతోషి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీలక్ష్మి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, యడ్ల రమణమూర్తి, ఆదిరాజు పాల్గొన్నారు.
- ========================
No comments:
Post a Comment