- courtesy with Eenadu vasundhara newspaper 09/2014.
Sailaja Kiran - సైలజా కిరణ్---Courtesy with Eenadu vasundhara news paper--09/2014
మార్గదర్శి.. పొదుపుని ప్రోత్సహిస్తూ, ఆర్థిక ఆసరా అందించే తెలుగువారి ఆత్మీయనేస్తం! ఓ చిట్‌ఫండ్ సంస్థకి సభ్యుల నమ్మకమే ప్రాణం. పాతికేళ్లుగా ఆ విశ్వాసాన్ని ఆమె చెక్కుచెదరనివ్వకపోవడం ఒకెత్తయితే.. 'ఒక్కో ఇటుకా పేర్చి కట్టినట్టు' సంస్థని అనూహ్యంగా విస్తరించడం మరొకెత్తు! శైలజాకిరణ్ బాధ్యతల్ని తీసుకున్నప్పుడు మార్గదర్శి టర్నోవర్ వంద కోట్లు. ఇప్పుడు ఏడున్నర వేల కోట్ల పైచిలుకు! సంస్థ ఎండీగా శైలజ సాధించిన ఇన్ని విజయాల వెనుక ఓ గృహిణిగా, తల్లిగా, రామోజీరావు ఇంటి కోడలిగా ఆమె ఉద్వేగాలేమిటి? గీతం వర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా వసుంధర ఆమెతో మాట్లాడింది.
వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి, అలాంటి కుటుంబంలోకే కోడలిగా అడుగుపెట్టా. ఈ రోజున ప్రముఖ చిట్‌ఫండ్ సంస్థ ఎండీగా నాకు చాలా గుర్తింపు వచ్చిందన్నది నిజమే! కానీ ఒకప్పుడు నా లక్ష్యం వ్యాపారం కాదు, డాక్టర్ కావడం. ఆరో తరగతి నుంచి మూడేళ్లు చెన్నైలోని కళాక్షేత్రలో ఉన్నా. తరవాత తొమ్మిది, పది తరగతులు విడిగా చదివా. డాక్టరు కావాలనుకుని ఇంటరులో సైన్స్‌ని ఎంచుకున్నా. ఆ రెండేళ్లూ నా ఆలోచనలన్నీ చదువు గురించే. అంతా 'పుస్తకాల పురుగు' అనేవారు. తొంభై రెండు శాతం మార్కులొచ్చాయి. కానీ నాన్‌లోకల్ కావడం వల్ల ఎంబీబీఎస్‌లో సీటు రాలేదు. నాకు బీఎస్సీ చేయాలనిపించలేదు. నాన్నగారు అప్పటికే రాయలసీమలో హ్యాచరీస్‌ని అభివృద్ధి చేశారు. పైగా ఇంట్లో ఇద్దరం అమ్మాయిలమే. భవిష్యత్తులో వ్యాపారం చూసుకుంటాననే స్పష్టత నాకుంది. అందుకే చెన్నైలో బీఏ లిటరేచర్, కోయంబత్తూరులో ఎంబీఏ చదివా.
ప్రొఫెసర్ కుదిర్చిన పెళ్లి...
అప్పట్లో సమాచారం తెలియాలన్నా, విజ్ఞానం పెరగాలన్నా పేపరు చదవడమే మార్గం. మా ఇంటికి 'ఈనాడు'వచ్చేది. పత్రిక చదివేదాన్ని కానీ ఆ ఇంటికే కోడలిగా వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను చదివిన ఎంబీఏ కాలేజీలో కిరణ్‌గారు నాకు రెండేళ్లు సీనియర్. నేను చేరేప్పటికి ఆయన చదువు పూర్తయి వెళ్లిపోయారు. మా ప్రొఫెసర్‌కి ఆయనంటే చాలా ఇష్టం. ఓసారి మా అత్తమ్మ ఫ్రొఫెసర్‌తో మాట్లాడుతూ 'మంచి అమ్మాయి ఉంటే చూడండి'అని అడిగారట. ఆమెకి నేనన్నా అభిమానమే. నా గురించి చెప్పారు. ఒకరికొకరం నచ్చడం, ఇరువైపుల పెద్దలూ మాట్లాడుకోవడం... అలా మా వివాహమైంది.
కొద్దిగా భయపడ్డా...
పెళ్లయిన కొన్ని నెలలకే మామగారు నాకు మార్గదర్శి బాధ్యతను అప్పగించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మొదట్లో కొద్దిగా భయపడ్డా. చిట్‌ఫండ్స్ అంటే లెక్కలతో, ఎంతోమంది డబ్బుతో కూడిన వ్యవహారం. చిట్ల రూపంలో డబ్బు తీసుకోవడం, దాన్ని మరొకరికి ఇవ్వడం, తిరిగి రికవరీ చేయడం.. వీటన్నిటిపై మొదట్లో నాకు అంతగా అవగాహన లేదు. క్రమంగా ఒక్కో విషయం తెలుసుకున్నా. సంస్థ ముందుకు పోవాలంటే నేనేం చేయాలీ.. అభివృద్ధి ఎక్కడ, ఎలా, ఏం చేస్తే వస్తుందీ... అని ఆలోచించా. ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా, నిదానంగా చేశా. ఇలా అనుకోగానే అలా అభివృద్ధి జరిగిపోయి, లాభాలు వచ్చేయాలని అనుకోలేదు. దేన్నీ పెద్ద సమస్యగా తీసుకోలేదు. మాట్లాడలేనేమో, చేయలేనేమో, నా వల్లకాదేమో... అన్న ఆలోచనల్ని దగ్గరికి రానీయలేదు. ఈ సానుకూల దృక్పథం, నిదానం నన్ను నిలబెట్టాయి.
పనే ప్రపంచమైంది..
మొదట్లో సాయంత్రం ఆరూ, ఆరున్నరకల్లా ఇంటికొచ్చేసేదాన్ని. కొంతకాలానికి అది ఏడున్నరయింది. బాధ్యతలు పెరిగాక రాత్రి పదీ, పదకొండుకి ఆఫీసు నుంచి బయలుదేరిన రోజులున్నాయి. ఇంటికొచ్చాక కూడా తెల్లవార్లూ పనిచేసిన సందర్భాలున్నాయి. పొద్దుటికల్లా పని పూర్తవ్వాలనుకుంటే రాత్రంతా కూర్చుండిపోయేదాన్ని. మామగారు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అది నా బాధ్యతను పెంచింది. ఎప్పటికప్పుడు నా పనినీ, సంస్థ అభివృద్ధినీ గమనించుకుంటూ, సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటూ ముందుకెళ్లా. నేను వచ్చేప్పటికే మార్గదర్శికి మంచి పేరుంది. స్పష్టమైన విధానాలు ఉన్నాయి. ఉన్నత విలువల మార్గం ఉంది. అప్పుడు టర్నోవరు వందకోట్లుండి స్థిరపడిపోయింది. ఆ సమయంలో నేను బాధ్యతలు తీసుకున్నా. ప్రతి జిల్లాలో ఒకటి... కొన్నిచోట్ల రెండూ మూడూ శాఖలు ప్రారంభించడం మొదలుపెట్టా. లక్షల మందికి చేరువయ్యేలా చూశా. సంస్థలో జరిగే ప్రతి అంశానికీ ఆడిటింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నా. వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే నిపుణులైన సిబ్బంది సంఖ్యను భారీగా పెంచాం. కంప్యూటరీకరణ, ప్రతి ఒక్కటీ విశ్లేషించడం, డేటా, డాక్యుమెంట్లూ, స్క్రీనింగ్, రికవరీ... ఇలా ప్రతిదీ వివరణాత్మకంగా ఉండేలా చూశాం. ఎంత చిన్న శాఖ అయినా అక్కడి చిట్ సభ్యులకు వందశాతం సేవలందించేలా జాగ్రత్తలు తీసుకున్నాం.
సంక్షోభంలోనూ ఎదిగాం...
ఏ మాటా రాకుండా సంస్థను నడపాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నా. కానీ 2006 నవంబరులో సంక్షోభం సృష్టించారు. రాజకీయంగా సంస్థను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. అభియోగాలు తెచ్చారు. ప్రభుత్వ భరోసా ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా ఈ పరిస్థితిని తట్టుకొని నిలబడటం కష్టమే! కానీ మేం భయపడలేదు. మేం ఎలా పని చేస్తాం, ఏ రకంగా డబ్బులు చెల్లిస్తాం, మా నిజాయతీ, నిబద్ధతా, అందించే సేవలూ, పాటించే విలువలూ... అన్నీ మా సభ్యులకూ, డిపాజిటర్లకూ తెలుసు. అందుకే లక్షలాది మంది సభ్యులు నూటికి నూరుశాతం మాపై నమ్మకం ఉంచారు. ధైర్యంగా ఉన్నారు. అది ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఈ సమయంలో ఉద్యోగులూ మాకు అండగా నిలిచారు. 'సంస్థకి ఏ ఇబ్బందీ రాదు, ఎప్పట్లానే మీకు మేం సేవలందిస్తాం' అని ఖాతాదారులకు భరోసా ఇచ్చారు. అందుకే ఆ సమయంలోనూ టర్నోవరు పెరిగింది. ఆ అభిమానం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం మార్గదర్శి టర్నోవరు ఏడున్నర వేల కోట్ల రూపాయలు దాటింది. ఉమ్మడి రాష్ట్రంతో పాటూ కర్ణాటక, తమిళనాడులోనూ శాఖల్ని విస్తరించాం. ప్రస్తుతం 105 శాఖలున్నాయి. ఈ సంఖ్యని 250కి చేర్చాలన్నది నా లక్ష్యం.
స్వయంగా బాధ్యత తీసుకున్నా..
నాకు ముందునుంచీ కళలంటే ఆసక్తి. అందుకే 'కళాంజలి' ప్రస్తావన వచ్చినప్పుడు నేనా బాధ్యత తీసుకుంటానని ముందుకెళ్లా. అప్పట్లో నాకెదురైన ఓ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది 1995, 96 సమయం. 'కళాంజలి'కి సంబంధించినవి కొనడానికి పశ్చిమబెంగాల్‌లోని శాంతినికేతన్ వెళ్లాం. తిరిగొస్తుంటే చీకటిపడింది. కారు రిపేర్ వచ్చి ఆగిపోయింది. అది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. కారు బాగవడం కష్టం అన్నాడు డ్రైవరు. ఇంతలో ఓ బస్సు రావడంతో నేనూ, నాతో వచ్చిన అమ్మాయీ గబుక్కున ఎక్కేశాం. అది బాగా పాత బస్సు. కిక్కిరిసి ఉంది. ఎవరికీ ఇంగ్లిష్, హిందీ రాదు. 'కలకత్తా జానా' అని రెండు సార్లు చెప్పాక దగ్గర్లోని రైల్వే స్టేషన్ దగ్గర ఆపారు. అదీ చాలా చిన్న స్టేషన్. గొంగళ్లు కప్పుకుని కొంతమంది మగవాళ్లు అక్కడ కూర్చుని ఉన్నారు. గబాగబా వెళ్లి స్టేషన్‌మాస్టర్ రూంలో కూర్చుని రైలొచ్చాక ఎక్కాం. కలకత్తా చేరేసరికి తెల్లవారుజామున మూడయింది. అప్పడు సెల్‌ఫోన్లు లేవు. మా అదృష్టం కొద్దీ ఓ టాక్సీడ్రైవర్ మమ్మల్ని భద్రంగా హోటల్ దగ్గర దిగబెట్టాడు. చాలా భయమేసింది.
ఎక్కువగా వింటా...
నాన్నగారి పెంపకంలో సహనంగా ఉండటం, తొందరపడకపోవడం నేర్చుకున్నా. పెళ్లయ్యాక నిరంతరం కష్టపడి పని చేసే ఇంట్లోకే వచ్చా. దీంతో పనిలోనే ఆనందం అన్న పరిస్థితి నాకు కొత్తగా అనిపించలేదు. ఇదికాక నా ప్లస్‌పాయింట్ తొందరపడకపోవడం. మాట్లాడటం కన్నా ఎక్కువగా వింటా. సంస్థలో ఉన్నతోద్యోగి నుంచి అటెండర్ వరకూ ప్రతి ఒక్కరూ ముఖ్యమే అనుకుంటా. సానుకూలతతో, ఎప్పుడూ నవ్వుతూ ఉండటం నాకు ఇష్టం. నవ్వుతూ ఉండేవారికి భగవంతుడి ఆశీస్సులు అందుతాయి అంటారు. ఒక నిర్వాహకురాలిగా ఎదుటి వారిని నిందించడం, తప్పొప్పులు వెతకడం లాంటివి చేయను.
పిల్లలు అర్థం చేసుకున్నారు..
తల్లిగా పిల్లల్ని పొద్దున్నే నిద్రలేపడం, దగ్గరుండి వాళ్ల అవసరాలు చూడటం లాంటివన్నీ నేను చేశాను. కానీ వీలు కుదిరినప్పుడే. కొన్నేళ్ల క్రితం వరకూ పిల్లల కోసం రోజులో కేటాయించే సమయం అరగంటకు మించేది కాదు. అత్తమ్మే పిల్లల్ని చూసుకునే వారు. ఈ విషయంలో ఆమెకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. పిల్లలకు దగ్గరగా లేకపోయినా, వారి అవసరాలు గుర్తించి, అన్నీ సమయానికి సమకూరేలా జాగ్రత్తలు తీసుకునేదాన్ని. ఇప్పుడు మా మూడోపాప విషయంలో అన్నిటికీ వెళుతున్నాం కానీ మా పెద్దమ్మాయి సమయంలో పేరెంట్ టీచర్ మీటింగ్‌లూ, స్కూల్‌డేలకు వెళ్లడమే కుదిరేది కాదు. కొందరు పిల్లలు 'నేను వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాల్సిందే.. నువ్వు రావాల్సిందే..' అని మంకుపట్టు పట్టడం నేను చూశా. కానీ మా పిల్లలు చాలా పరిణతితో ఉండేవాళ్లు. ఏనాడూ అలగడం, నన్ను కోపగించుకోవడం, విసుక్కోవడం లాంటివి చేయలేదు. చాలా సర్దుకుపోయేవారు. అందుకే నేనీ స్థాయికి చేరుకోగలిగా. కానీ ఒక తల్లిగా వాళ్లకు చాలా తక్కువ సమయం కేటాయించాననే వెలితి మాత్రం నాకెప్పుడూ ఉంటుంది. ముగ్గురికీ సంగీతం నేర్పించాం. పెద్దమ్మాయి, మూడో అమ్మాయి చిత్రలేఖనంలో శిక్షణ తీసుకున్నారు. వ్యాపారాలున్నాయి కాబట్టి వాళ్ల తాతగారితో మాట్లాడి, ఆయన సూచన తీసుకుని భవిష్యత్తులో ఉపయోగపడే కోర్సులు చదువుతున్నారు. చదువు విషయంలో వాళ్లని నేను ఏనాడూ ఒత్తిడి చేయలేదు.
ఆయన ప్రోత్సాహమెంతో...
మావారు కిరణ్ నా కష్టపడే తత్వాన్ని ఎప్పుడూ గుర్తిస్తారు. నాకు ఒంట్లో ఏ మాత్రం నలతగా ఉన్నా 'ఈ రోజు ఆఫీసుకు వెళ్లొద్దు. విశ్రాంతి తీసుకో. నీ ఆరోగ్యం ముఖ్యం' అంటారు. బ్రాంచీల్ని చూడ్డానికి జిల్లాలకు వెళ్లినప్పుడూ రాత్రి ఎనిమిది తొమ్మిదింటికల్లా ఇంటికి చేరుకోవచ్చుగా అంటారు. నా మీద పెత్తనం చలాయించాలనిగానీ, తన మాటే నెగ్గాలనిగానీ అస్సలు అనుకోరు. మగవాళ్లు అనుక్షణం అజమాయిషీ చేస్తూ, కావాలని విమర్శిస్తుంటే ఆడవాళ్లు నెగ్గుకురావడం కష్టం. చాలా సందర్భాల్లో ఇద్దరం మాట్లాడుకుని ఏది మంచిదయితే అదే చేస్తాం. నా విజయాల్ని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారు. అంత పెద్ద స్థాయిలో ఉన్నా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఉన్నత విలువలు పాటిస్తారు. అవి ఆయనకు జన్మతః వచ్చాయనిపిస్తుంది. అలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టమే.
విశ్రాంతి ఇలా...
ఎంత పని ఉన్నా పుస్తకాలు చదువుతా. రోజూ నాలుగైదు దినపత్రికలూ, మ్యాగజైన్లూ చూస్తుంటా. ఒకప్పుడు సినిమాలూ బాగా చూసేదాన్ని. ఈ మధ్యన ఏడాదికి మూడు నాలుగే చూస్తున్నా. అదీ బాగుందనుకుంటేనే. నాలుగైదేళ్లుగా వ్యాయామం, యోగా చేస్తున్నా. కామెడీ షోలూ బాగా చూస్తాను. ఇవన్నీ ఒత్తిడిని తగ్గించి, విశ్రాంతినిస్తాయి. నాకు దైవభక్తి ఎక్కువే. నా ఇష్టదైవాలు వెంకటేశ్వరస్వామి, మహాలక్ష్మి. పదిమందికి మేలు చేయడంలోనే జీవితం గడవాలనే తత్వం నాది. అందువల్లే లక్షల మంది అభిమానం పొందగలిగా. ఈ రోజున బయటికెళితే చాలామంది నన్ను పలకరిస్తారు. చిరునవ్వుతో హలో చెబుతారు. వాళ్ల నవ్వులో, పలకరింపులో ఎంతో ఆత్మీయత ఉంది. అవి నాకెంతో విలువైనవి. వెలకట్టలేనివి.
పెద్దమ్మాయ్ అంటారు...
సాధారణంగా మామగారు పొద్దున్నే నాలుగింటికి లేచి వాకింగ్ చేస్తుంటారు. ఆ పాటికే నేను కార్లో బ్రాంచీల్ని చూడ్డానికి వెళ్లిపోయేదాన్ని. ఆయన నా పని గురించి నన్ను ప్రశ్నించకపోయినా గమనిస్తూనే ఉంటారు. దాన్నెప్పుడూ గుర్తిస్తారు. అభినందిస్తారు. అదే నాకు ఇంకా బాగా, జాగ్రత్తగా, పకడ్బందీగా ఎలాంటి పొరపాటు లేకుండా పనిచేయడానికి స్ఫూర్తి. మార్గదర్శి సంక్షోభం వచ్చినా సంస్థ సాధించిన పురోగతిని గమనించారాయన. ఆ ఏడాది నా పుట్టినరోజున నాన్నగారితో కలిసి ఆశీస్సులు తీసుకుందామని మామగారి దగ్గరికెళ్లా. ఆయన ఆశీర్వదిస్తూనే 'ఇద్దరు తండ్రుల ముద్దుల బిడ్డవమ్మా' అన్నారు. ఎంత సంతోషం కలిగిందో చెప్పలేను. ఆయనెప్పుడూ నన్నూ, మా విజయేశ్వరినీ కోడళ్లుగా చూడలేదు. పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అనే చెబుతుంటారు. అది నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. మామగారు మా ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరినీ అత్యంత అపురూపంగా చూసుకుంటారు.
అలా చెబితే ఆనందపడ్డా...
అప్పుడు మా రెండోపాప నాలుగో పుట్టిన రోజు. పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగాను. వెంటనే 'గృహిణిగా ఉండి, నా పిల్లల్నే కాదు, అక్క పిల్లల్నీ చూసుకుంటా..' అంది. అది విని, నన్ను వాళ్లెంత మిస్సవుతున్నారో కదా అనిపించింది. ఇది జరిగిన రెండేళ్లకు అమెరికాలో నాకు 'ఉమన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు ఇచ్చారు. అందరూ మెచ్చుకోవడం, అభినందించడం తను చూసింది. తరవాత ఓ ఛానల్ వాళ్లు వచ్చి 'పెద్దయ్యాక నువ్వేమవుతావు' అని అడిగారు. వెంటనే 'బిజినెస్ ఉమన్' అంది. చాలా సంతోషంగా అనిపించింది. వాళ్లు నన్ను మిస్ అయినా నా కష్టాన్ని గుర్తిస్తారని అప్పుడనిపించింది. తాజాగా నాకు గౌరవ డాక్టరేట్ ప్రకటించాక కూడా దాన్ని అంగీకరించే ముందు పిల్లలతో మాట్లాడా. 'నువ్వెంత కష్టపడ్డావో మాకు తెలుసు.. నీకు దాన్ని తీసుకునే అర్హత ఉంది' అన్నారు.
ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ..
పెళ్లయ్యాక ఒక్క పండక్కి మాత్రం పుట్టింటికెళ్లా. తరవాత సెలవులు వచ్చినప్పుడు పిల్లల్ని దింపడం, తీసుకురావడం తప్పితే నేను పట్టుమని ఓ వారం అక్కడ ఉన్నది లేదు. నాకు ఆ ధ్యాస కూడా ఉండేది కాదు. నా లక్ష్యం, నా కల, నా పనే నా ప్రపంచం. ప్రతి ఏడాది ఓ లక్ష్యం పెట్టుకునేదాన్ని. దాన్ని చేరుకునేలోగానే మరొకదాన్ని నిర్దేశించుకునేదాన్ని. నేను 1990లో బాధ్యతలు తీసుక్నుప్పుడు సంస్థ టర్నోవరు వందకోట్లు. తరవాత అది 350 కోట్లకి చేరింది. అదయ్యాక 500 కోట్లకు చేర్చాను. తరవాత వెయ్యి, రెండు వేల కోట్లు. వంద పరుగులు పూర్తయ్యాక వికెట్ ఇచ్చుకునే బ్యాట్స్‌మెన్‌లా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పటికప్పుడు లక్ష్యాలు పెట్టుకుని సాధించడమే పని. ఇందులో నాకు ఆనందం ఉంది. లక్షల మంది ఖాతాదారుల సుస్థిర జీవితాలున్నాయి. వీటి ముందు షికార్లకు పోవాలన్న ఆలోచనలు ఏపాటివి! అయితే ఇది ఒక్క రాత్రిలో వచ్చిన ఎదుగుదల కాదు. ఇటుకపై ఇటుక పేర్చుకుంటూ వచ్చాను.
- =========================
No comments:
Post a Comment