Tuesday, February 1, 2011

జె.ఆర్.వనమాలి,J.R.Vanamali


జ్ఞాపకాలు
'శ్రీశ్రీకి మహాప్రస్థానం వినిపించాను' -జె.ఆర్.వనమాలి


ఢిల్లీ ఆకాశవాణిలో ఒకప్పుడు తెలుగు వార్తలు చదివిన ఈయన 'కళావాచస్పతి జగ్గయ్య' సమకాలికుడు. జె.ఆర్. వనమాలిగా సుప్రసిద్ధులైన 'జగన్నాథరావు వనమాలి' అనే ఈ ఆరణాల తెలుగువాడు గాత్రధారణలో భీష్మాచార్యులు. అంచెలంచెలుగా ఎదిగి 20 ఏళ్లక్రితం 'వర్డ్స్ అండ్ వాయిసెస్స్' అనే సంస్థని ముంబాయిలో స్థాపించారు. ఫిలిం మరియు అడ్వర్టయిజ్‌మెంట్ రంగాల్లో ఇప్పుడు నిష్ణాతులుగా పేరుతెచ్చుకున్న ఎందరో కళాకారులకు వనమాలిగారే తొలి గురువు. థియేటర్ ఆర్ట్స్ రంగంలో 'వాయిస్ ఆర్టిస్ట్'గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా పొందారు. 86 ఏళ్ల వయసులోనూ సంస్థని చురుకుగా నడిపిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న వనమాలి అంతరంగతరంగాలే ఈ వారం జ్ఞాపకాలు.

హైస్కూలు చదువుతున్నప్పుడు పాకెట్ మనీ ఇచ్చేవారు. వాటితో పుస్తకాలు కొనుక్కునే వాడ్ని. ముఖ్యంగా ముద్దుకృష్ణ 'వైతాళికులు' సంకలనంలో వినాయకరావు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీశ్రీ, విశ్వనాథ, కృష్ణశాస్త్రిగార్ల కవితలు నాకు కంఠస్థం. ఆ పుస్తకం ఎప్పుడూ నా చేతిలోనే ఉండేది.
1944 - 45 ప్రాంతాల్లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుతూ హాస్టల్లో ఉండేవాణ్ణి. నాకు సంగీతం మీద కూడా అభిలాష ఉండటంతో హాస్టల్‌లో ఉండే కుర్రాళ్లకి పద్యాలు పాడి వినిపించేవాణ్ణి. నాకు సాహిత్యపరంగా నచ్చిన పద్యాలకి, కవితలకి రాగాలు కట్టి పాడేవాణ్ణి. ఆ రోజుల్లోనే శ్రీశ్రీ 'మహాప్రస్థానం' పబ్లిష్ అయింది. ఇంట్లోవారు నెల నెల ఇచ్చే పాకెట్ మనీ దాచుకుని ఆ పుస్తకం కొన్నాను. 'మహాప్రస్థానం'లోని కవితలన్నీ నాకు కంఠస్థమే. ముప్పై పేజీలున్న చలం 'అమీనా' కూడా మొదట్నించి చివరిదాకా అప్పచెప్పేవాణ్ణి.

శ్రీశ్రీ పరిచయం

ఆ రోజుల్లో శ్రీశ్రీ రాజమండ్రి ఆర్యాపురంలో అద్దెకు ఉండేవారు-గురజాడ అప్పారావు 'కన్యాశుల్కం' నాటకాన్ని సినిమాగా తీయాలని. ఆ సందర్భంలో శ్రీశ్రీకి నా గురించి ఎలాగో తెలిసింది 'ఆర్ట్స్ కాలేజీలో ఒక కుర్రాడున్నాడని, ఆయన రాసిన కవితల్ని , పద్యాలని బాగా వినిపిస్తాడని'. అప్పటికి శ్రీశ్రీకి 30 ఏళ్లుంటాయి. నాకు 16 ఏళ్లు. ఒకరోజు ఆయన హాస్టల్‌కు వచ్చి 'ఇక్కడ జగన్నాథరావు ఎవరు?' అని అడిగారు. 'నేనే' అని బదులిచ్చాను. అప్పటిదాకా ఆయనే శ్రీశ్రీ అని నాకు తెలీదు. 'నీవు శ్రీశ్రీ కవితల్ని రిసైట్ చేస్తావట కదా, ఏదీ చెప్పు?' అన్నారు.

'అవును. కానీ ఇప్పుడు చెప్పే మూడ్ లేదు' అన్నాను. 'మరి మూడ్ ఎప్పుడు వస్తుందో చెప్పు. అప్పుడు వస్తాను' అన్నారు. 'సాయంత్రం' అన్నాను. మళ్లీ సాయంత్రం వచ్చారు. ఇద్దరం కలిసి గోదావరి స్టేషన్ దగ్గర్లో ఉన్న ఒక లంకకు నావలో వెళ్లి, ఇసుకలో కూర్చున్నాం. అప్పుడు చెప్పారు 'తనే శ్రీశ్రీ' అని. నాతో నండూరి ఎంకిపాటలు కూడా పాడించుకున్నారు. అలా మొదలయ్యింది మా మధ్య స్నేహం. ఇద్దరి మధ్యా పదిహేనేళ్ల వయసు తేడా ఉన్నా మంచి స్నేహితులమయ్యాం. సినిమా షూటింగ్ లేనప్పుడు ఇద్దరం కలుసుకునే వాళ్లం. ఆ రోజులు మరపురానివి.

ఆకాశవాణిలో చేరిక
అవి ఆంధ్రాయూనివర్సిటీలో నేను బి.ఎ. ఆనర్స్ చేస్తున్న రోజులు (1947). ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్లు కావలెనని 'న్యూస్ పేపర్లో' అడ్వర్టయిజ్‌మెంట్ చూసి సరదాగా అప్లయ్ చేశాను. రాను పోను ఖర్చులు వాళ్లే పెట్టుకోగా న్యూఢిల్లీ వెళ్లాను. వార్తల విభాగంలో ఉద్యోగం వచ్చింది. తెలుగులో వార్తలు చదివేవాణ్ణి. అక్కడ జగ్గయ్య నా రూమ్‌మేట్. ఇద్దరం బాచిలర్స్‌మే. మిగతా తెలుగు వాళ్లు వివాహితులు.
ఆ రోజుల్లో వార్తలు చదవడానికి రికార్డింగ్ రూంలోకి వెళ్లాక న్యూస్ కాగితాలు పంపించేవారు. రిహార్సల్స్‌కి సమయం ఉండేది కాదు. అంతా లైవ్ కార్యక్రమం. రికార్డిస్టుకి ఏమీ తెలిసేది కాదు. నిజానికి అక్కడుండే వ్యక్తి రికార్డిస్ట్ కాదు, సౌండు ఇంజనీరు. ఆయనకు తెలిసిందల్లా టైముకి రికార్డు చేయడం. గైడెన్స్ ఉండేది కాదు. లైబ్రరీకి వెళ్తే అక్కడ చాలా పుస్తకాలు ఉన్నా సౌండ్ గురించిన పుస్తకాలు ఉండేవి కావు. మేము ఎలా చదివామో మాకు తెలిసేది కాదు. గాజు తలుపుల గదిలో ఉండి బయటికి వినపడదని గట్టిగా అరిచి చదివేవాళ్లం. ఆ శబ్దానికి గాజు తలుపులు కంపించేవి.



ఇంటర్వ్యూలు అవీ మేమే రాయాల్సి వచ్చేది. కొంత పన్యాల జగన్నాథరావు, వారణాసి సుబ్రమణ్యంగార్లు రాసేవారు. మధ్యాహ్నం ఒంటిగంటకు డ్యూటీ అయిపోతే మళ్లీ సాయంత్రం డ్యూటీకి వచ్చేయాలి. మళ్లీ ఎక్కడికెళతాం అని అక్కడే ఉండేవాళ్లం. కన్నాట్ ప్లేస్ అప్పుడు విలేజ్‌లా ఉండేది. అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. అందుకే అక్కడే భోంచేసి తిరిగి వచ్చేసే వాళ్లం. జగ్గయ్య నాకంటే సీనియర్. ఆయనకి అప్పటికే నాటకాల్లో ప్రవేశం ఉంది. అంచేత ఉద్యోగం వదిలేసి సినిమాల్లో చేరడానికి మద్రాసు వెళ్లిపోయారు. 'ఏదో ఒక జాబ్ చూస్తాను. వచ్చేయండి' అని నాతో కూడా అన్నారు. అయినా నేను వెళ్లలేదు. ఫిల్మ్ డివిజన్‌లో ప్రవేశం

1956లో ముంబాయి ఫిల్మ్ ్స డివిజన్ వాళ్ల అడ్వర్టయిజ్‌మెంట్ వచ్చింది. అప్లయ్ చేస్తే ఉద్యోగం వచ్చింది. రేడియోలో రిజైన్ చేసి అక్కడ జాయిన్ అయ్యాను. గట్టిగా అరిచి చదవక్కర్లేదు, నెమ్మదిగా చదవచ్చని తెలసుకున్నాను. మా వాయిస్ మేం విని తర్వాత రికార్డింగ్ చేసేవాళ్లం. మా వాయిస్ ఎలా బాగు చేసుకోవాలో తెలిసేది. ఆ విధంగా నా వాయిస్‌కి మెరుగులు దిద్దుకున్నాను. ఫిల్మ్ ్స డివిజన్‌లో ఎన్నో గ్రంథాలుండేవి కాని అక్కడా వాయిస్ గురించి ఒక్క పుస్తకం కన్పించలేదు.
ఫిల్మ్ ్స డివిజన్‌లో పని ఎక్కువగా ఉండేది. నెమ్మదిగా కమర్షియల్ రంగం మొదలయింది. 'ఒన్ మినిట్ యాడ్స్', డాక్యుమెంటరీ ఫిల్మ్ ్స వచ్చాయి. 1960 వరకూ ఫిల్మ్ ్స డివిజన్‌లోనే ఉన్నాను.

వాయిస్ శిక్షణ ఇచ్చేవాణ్ణి

ఫిల్మ్ ్స డివిజన్‌లో ఉండగానే ఒకరోజు దుర్గాఖోటేగారు వచ్చి 'ఎన్నాళ్లు ఇక్కడ ఉంటావు? బయటికి వచ్చేయి. వాయిస్‌లో శిక్షణ లేక చాలామంది ఎదురు చూస్తున్నారు. నువ్వు ఆర్గనైజ్ చేయగలవు' అని ధైర్యం చెప్పారు. ఆవిడకు 'దుర్గాఖోటే ప్రొడక్షన్స్' అని సంస్థ ఉండేది. ఆవిడ మాట ప్రకారం బయటకి వచ్చి కొద్దిమంది మిత్రులతో కలిసి ప్రారంభించాను. ఆ రోజుల్లో ఇలా వాయిస్ శిక్షణ ఇచ్చేవారెవరూ లేరు. పిచ్ అంటే ఏమిటి? వాల్యూమ్ అంటే ఏమిటి? పాజ్ ఎప్పుడు ఇవ్వాలి? మాడ్యులేషన్, డబ్బింగ్ అంటే ఏమిటి? ఇలా ఎన్నో విషయాల మీద శిక్షణ ఇచ్చేవాణ్ణి. అక్కడికి వచ్చేవాళ్లు ఉద్యోగస్తులు. సాయంత్రాలు క్లాసులకు వచ్చేవారు. అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం తిరగటం, వాళ్లు సరిగా డబ్బులు ఇవ్వక పోవటంతో దానితోనూ విసిగిపోయాను.

అమెరికాలో శిక్షణ పొందాను

1980లో మా అమ్మాయి కోసం అమెరికా వెళ్లినప్పుడు బ్రాడ్‌వేలో ఒక నాటకం చూడ్డం జరిగింది. అక్కడ వాయిస్‌కి ట్రైనింగ్ వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆ రోడ్డు రోడ్డంతా ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చే వర్క్‌షాప్స్ ఉండేవి. వారం ఉందామని అనుకున్న వాణ్ణి నాలుగైదు వారాలు ఉండి నేను కూడా ట్రైనింగ్ అయ్యాను. అది నాకు కనువిప్పు. నేను చేస్తున్న పని, ఇన్ని రోజులు నేను ఆచరిస్తున్న విధానం ఎంత తప్పో తెలిసింది. అప్పుడు నాకు మళ్లీ ఇంట్రస్ట్ కలిగింది. ముఖ్యంగా అక్కడ ఒక టీచర్ ఉండేది. ఆవిడ లండన్‌లో ట్రైనింగ్ అయింది. 'ఐరిష్ వారెన్' ఆమె పేరు. లండన్‌లో డ్రామాకి, ఫిల్మ్స్‌కి, రేడియోకి వాయిస్‌లో ట్రైనింగ్ అయింది. అమెరికాలో వాయిస్ ట్రైనింగ్ ఇచ్చేది. అనుకోకుండా వాయిస్ మీద ఒక పుస్తకం కూడా అక్కడ దొరికింది నాకు.

'వర్డ్స్ అండ్ వాయిసెస్' ప్రారంభం

కొంతమందితో కలిసి మళ్లీ బొంబాయిలో (1991) 'వర్డ్స్ అండ్ వాయిసెస్' సంస్థని స్థాపించాను. ట్రైనింగ్‌లో భాగంగా పిచ్, వాల్యూమ్, మాడ్యులేషన్, కార్డ్ మొదలైన విషయాలెన్నో ఉంటాయి. ఒక్క తెలుగులోనే కాదు. హిందీ, మరాఠీ, మలయాళం, రష్యన్, ఇంగ్లీష్ ఇంకా ఎన్నో భారతీయ భాషల్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇక్కడికి యాక్టర్లే కాదు లాయర్లు కూడా వస్తుంటారు.
అప్పుడే పుట్టిన పాపాయికి ఏ భాషా రాకపోయినా గాలి శరీరంలోకి ప్రవేశించి, తిరిగి శబ్దంగా బయటికి వస్తుంది. ఏడవటం మొదలుపెడుతుంది. ఇదంతా ఆటోమేటిక్‌గా శ్వాస ద్వారా జరిగే ప్రక్రియ. మన స్వరం ఒక సంగీత వాయిద్యం వంటిది. వయోలిన్, వీణలని శృతి చేస్తే ఎన్నో రాగాలు పలికించవచ్చు. అలాగే మన గళం నుండి కూడా ఎన్నో భావాలు పలికించవచ్చు. నా దగ్గర తర్ఫీదు పొందినవారు సినీ, డబ్బింగ్, అడ్వర్టయిజ్‌మెంట్ రంగాల్లో ప్రొఫెషనల్స్‌గా ఉన్నారు. కొందరు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కూడా మొదట్లో నా దగ్గర తర్ఫీదు పొందినవారే.

నా జీవితాన్ని వాయిస్‌కే అంకితం చేశాను. తొలి రోజుల్లో 'తెలుగు స్వతంత్ర'లో కొన్ని వ్యాసాలు, కథలు రాశాను. ఒక పుస్తకం కూడా వెలువడింది. ఆంగ్లంలో ఎన్నో స్క్రిప్ట్స్ రాశాను. ఫిల్మ్ ్స డివిజన్‌లో ఉన్నప్పుడు తరచుగా ఇంగ్లీషు నుంచి తెలుగులోకి తర్జుమాలు చేసేవాణ్ణి.
ట్రెక్కింగ్ నా ఇతర హాబీ. హిమాలయాలలో పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. పదివేల అడుగుల ఎత్తు వరకు వెళుతుంటాను. నేటికీ ఈ అలవాటు కొనసాగిస్తున్నాను. ఇటీవలే భూటాన్‌లో కూడా పర్వతారోహణ చేశాను. ఫోటోగ్రఫీ నా మరో హాబీ.
పెరుగుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ ... టీవీ ఛానల్స్ ... ఈ రంగాల్లో డబ్బింగ్ ఆర్టిస్టులకు మంచి అవకాశాలున్నాయి. అవసరమైన ఆర్టిస్టులందరికి మా 'వర్డ్ ్స అండ్ వాయిసెస్ ఇన్‌స్టిట్యూట్' ద్వారా మంచి శిక్షణను నా ఊపిరి ఉన్నంతవరకూ ఇవ్వాలనేదే నా ఆకాంక్ష.



- మణినాథ్ కోపల్లె(Andhrajyothi news paper)


  • ============================
Visit My website - > Dr.Seshagirirao

3 comments:

  1. మణినాథ్ గారూ నంస్కారం. శ్రీ వనమాలి జగన్నాథరావుగారి శిష్య కోటిలో నేనూ ఒకణ్ణి. వారిని తెలుగు ప్రజకి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అక్కడక్కడా విషయ సేకరణలో కొన్ని తప్పులున్నటుగా గోచరిస్తోంది. ఉదాహరణకి వర్డ్స్ అండ్ వాయిసెస్ ని వారు 1991లో స్థాపించారని శెలవిచ్చారు. నాకు 1983 నుంచీ వారితో అనుబంధం ఏర్పడింది. అప్పటికే ఆ సంస్థ ఉంది. వారు వాయిస్ కో-ఆర్డినషన్ చేసేవారు.ఆ తరువాత బహుసా శిక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు అని మీరు పేర్కొన్నారు. అది ''దాదా సాహేబ్ ఫాల్కే అకాడమీ అవార్డు అని నాకు గుర్తు. వారిని నేను ఈ మధ్యే వారింట్లోనే కలిసాను. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.
    శెలవ్
    ఇట్లు
    భవదీయుడు
    అత్తిలి అనంతు
    (ఏ.వీ.అనంతరాం)

    ReplyDelete
  2. ''.....బీహారులో వరదలు....లక్షలాది మంది మృతి చెందారు...." చాలా మంది మిమిక్రీ కళాకారులు ఒకప్పుడు, అంటే దాదాపూ నలభై ఏళ్ళ క్రితం వరకూ కూడా కంటికి కనిపించని ఆ గొంతుని అనుకరిస్తూ ఉండేవారు. నేనూ అనుకరిస్తూ ఉండేవాణ్ణి.
    సినిమా హాళ్ళల్లో అసలు సినిమా మొదలుకాక ముందు న్యూసు రీలు వేసేవారు. నేపధ్యంలో ఆ గొంతు వినిపిస్తే చాలు....
    నేను మంత్రముగ్ధుణ్ణైపోయేవాణ్ణి. తెర పైన సన్నివేశాలు ఎలా కదలాడుతున్నా కనిపించని ఆ గొంతు మాత్రం నా గుండెలను ఖచ్చితంగా తాకేది....
    తెలుగమ్మ నా యెద లోతుల్లో ఓ చినుకై రాలేది .... తెలుగమ్మ ఒక సరస్సై నిశ్శబ్ద నాదం చేసేది....తెలుగమ్మ ఒక సెలయేరై గలగల పారేది.....తెలుగమ్మ జలపాతమై దూకేది....తెలుగమ్మ ఉన్నట్టుండి నా కంట ఉప్పుటేరును పారించి గుండెను బరువు చేసిపారేసేది...తెలుగమ్మ అమ్మనే మరిపించి మురిపించేది.... తెలుగమ్మే
    ముద్దుగుమ్మై మురిపించి మైమరపించేది. ఆ గొంతులోని తెలుగమ్మ అంతగా నా అణువణువునూ శాశించేది....
    నా ప్రాణమై శ్వాసించేది....
    అలాంటి తెలుగమ్మ గురుదేవులైన శ్రీ.వనమాలి జగన్నాథరావుగారి రూపంలో ముంబాయి మహా నగరంలో 1983లో సాక్షాత్కరించింది. ఫోనులో ఆ గొంతుని వినగానే అనుకోకుండా నా కంట నీరు కారింది. గబ గబా అడ్రస్సు వ్రాసుకుని పిచ్చివాడిలా పరుగెట్టుకుంటూ వెళ్ళాను... ఇన్నేళ్ళూ నా గుండెను మీటుతూనే ఉన్న ఆ గొంతు బాహ్య సౌందర్యాన్ని తనివి తీరా చూద్దామని.... చూసాను.. దేవుణ్ణి చూసినంత ఆనందం కలిగింది. ఆ క్షణం నుంచీ తెలుగమ్మ మా అనుబంధంలో ఎన్నెన్నో అందాలను చిమ్మింది.
    నిన్ననే అంటే 2016 మే 19వ్ తేదీ ఉదయం కన్ను మూసారు.
    స్వర్గీయ వనమాలిగారు ఎందరెందరో గాత్ర కళాకారులకు గురుదేవులు. ఎన్నో భాషలకు చెందినవారు ఆయన ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
    నిన్న వారు పరమపదించడంతో ముంబాయి అడ్వర్టైజింగ్ మీడియాలోని నాలుగు తరాల వాయిస్ ఆర్టిస్టులందరూ అనాధలైయ్యారు.😔

    స్వర్గీయ వనమాలిగారి గురించి క్లుప్తంగా....
    *1948 ఆకాశవాణి డిల్లీ కేంద్రంలో తెలుగు వార్తలు చెప్పెవారు.
    * కొంగర జగ్గయ్యగారు వీరికి సన్నిహితులు.
    *శ్రీశ్రీగారి కవితలన్నీ కంఠస్తం పట్టారు.
    శ్రీశ్రీగారితో కొంతకాలం దగ్గరగా మెలిగారు.
    * దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డు గ్రహీత.
    * ఫిలిం డివిజన్ లో కామెంటరీ స్పీకరుగా పనిచేసారు.
    *వర్డ్స్ అండ్ వాయిసెస్ సంస్థ పేరున నావంటి వాయిస్ ఆర్టిస్టులను
    ఎందరినో ఫీల్డుకి పరిచయం చేసారు.

    ReplyDelete
  3. ''.....బీహారులో వరదలు....లక్షలాది మంది మృతి చెందారు...." చాలా మంది మిమిక్రీ కళాకారులు ఒకప్పుడు, అంటే దాదాపూ నలభై ఏళ్ళ క్రితం వరకూ కూడా కంటికి కనిపించని ఆ గొంతుని అనుకరిస్తూ ఉండేవారు. నేనూ అనుకరిస్తూ ఉండేవాణ్ణి.
    సినిమా హాళ్ళల్లో అసలు సినిమా మొదలుకాక ముందు న్యూసు రీలు వేసేవారు. నేపధ్యంలో ఆ గొంతు వినిపిస్తే చాలు....
    నేను మంత్రముగ్ధుణ్ణైపోయేవాణ్ణి. తెర పైన సన్నివేశాలు ఎలా కదలాడుతున్నా కనిపించని ఆ గొంతు మాత్రం నా గుండెలను ఖచ్చితంగా తాకేది....
    తెలుగమ్మ నా యెద లోతుల్లో ఓ చినుకై రాలేది .... తెలుగమ్మ ఒక సరస్సై నిశ్శబ్ద నాదం చేసేది....తెలుగమ్మ ఒక సెలయేరై గలగల పారేది.....తెలుగమ్మ జలపాతమై దూకేది....తెలుగమ్మ ఉన్నట్టుండి నా కంట ఉప్పుటేరును పారించి గుండెను బరువు చేసిపారేసేది...తెలుగమ్మ అమ్మనే మరిపించి మురిపించేది.... తెలుగమ్మే
    ముద్దుగుమ్మై మురిపించి మైమరపించేది. ఆ గొంతులోని తెలుగమ్మ అంతగా నా అణువణువునూ శాశించేది....
    నా ప్రాణమై శ్వాసించేది....
    అలాంటి తెలుగమ్మ గురుదేవులైన శ్రీ.వనమాలి జగన్నాథరావుగారి రూపంలో ముంబాయి మహా నగరంలో 1983లో సాక్షాత్కరించింది. ఫోనులో ఆ గొంతుని వినగానే అనుకోకుండా నా కంట నీరు కారింది. గబ గబా అడ్రస్సు వ్రాసుకుని పిచ్చివాడిలా పరుగెట్టుకుంటూ వెళ్ళాను... ఇన్నేళ్ళూ నా గుండెను మీటుతూనే ఉన్న ఆ గొంతు బాహ్య సౌందర్యాన్ని తనివి తీరా చూద్దామని.... చూసాను.. దేవుణ్ణి చూసినంత ఆనందం కలిగింది. ఆ క్షణం నుంచీ తెలుగమ్మ మా అనుబంధంలో ఎన్నెన్నో అందాలను చిమ్మింది.
    నిన్ననే అంటే 2016 మే 19వ్ తేదీ ఉదయం కన్ను మూసారు.
    స్వర్గీయ వనమాలిగారు ఎందరెందరో గాత్ర కళాకారులకు గురుదేవులు. ఎన్నో భాషలకు చెందినవారు ఆయన ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
    నిన్న వారు పరమపదించడంతో ముంబాయి అడ్వర్టైజింగ్ మీడియాలోని నాలుగు తరాల వాయిస్ ఆర్టిస్టులందరూ అనాధలైయ్యారు.😔

    స్వర్గీయ వనమాలిగారి గురించి క్లుప్తంగా....
    *1948 ఆకాశవాణి డిల్లీ కేంద్రంలో తెలుగు వార్తలు చెప్పెవారు.
    * కొంగర జగ్గయ్యగారు వీరికి సన్నిహితులు.
    *శ్రీశ్రీగారి కవితలన్నీ కంఠస్తం పట్టారు.
    శ్రీశ్రీగారితో కొంతకాలం దగ్గరగా మెలిగారు.
    * దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డు గ్రహీత.
    * ఫిలిం డివిజన్ లో కామెంటరీ స్పీకరుగా పనిచేసారు.
    *వర్డ్స్ అండ్ వాయిసెస్ సంస్థ పేరున నావంటి వాయిస్ ఆర్టిస్టులను
    ఎందరినో ఫీల్డుకి పరిచయం చేసారు.

    ReplyDelete