Wednesday, November 14, 2012

MurtyRaju,చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు

  •  
  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము .... 

 గాంధేయవాది మూర్తిరాజు కన్నుమూత-1800 ఎకరాలు దానం చేసిన దాత-సర్వోదయ ఉద్యమానికి చేయూత-ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక-ఆక్వా పరిశ్రమకు ఆద్యుడు-నిడమర్రు ,విద్యాదాత, అభినవ భోజుడు, గాంధేయవాది, సర్వోదయ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖుడు, మాజీ మంత్రి చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు (93) సోమవారం రాత్రి 7 గంటలకు కన్ను మూశారు. ఆయన గడచిన నాలుగు నెలలుగా శ్వాసకోశ, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆయన స్వగ్రామం నిడమర్రు మండలం పత్తేపురంలో స్వగృహంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసీయూలోనే రెండు నెలలుగా చికిత్స పొందుతూ అంతిమ శ్వాస విడిచారు. ఆయన కొల్లేరు రాజుగా గుర్తింపు పొందారు. తన 1800 ఎకరాల ఆస్తిని ధర్మసంస్థ ఏర్పాటుకు దానంగా ఇచ్చారు. 14 కళాశాలలు, 58 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి అవిరళ కృషి చేశారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు . కొల్లేరు కార్మికుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు, ఆక్వా పరిశ్రమకు బీజం వేశారు. 1919 డిసెంబరు 16న తణుకు సమీపంలోని సత్యవాడలో జన్మించిన ఆయన జమిందారీ కుటుంబానికి చెందిన చింతలపాటి బాపిరాజు, సూరాయమ్మల ఏకైక సంతానం. ఆయనకు కలిగిన ఒక్కగానొక్క కుమారుడు చిన్నతనంలోనే కన్ను మూయగా భార్య సత్యవతీదేవి 2010లో పరమపదించారు.

జీవితం.. ప్రజాసేవకే అంకితం: బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మూర్తిరాజు తన జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేశారు. చిన్నతనంలోనే మహాత్మాగాంధీ ప్రభావం ఆయనపై పడింది. చివరి వరకు ఆయన నిజమైన గాంధేయవాదిగానే ఉన్నారు. మహాత్మాగాంధీ దేశ పర్యటనలో భాగంగా 1929లో జిల్లాకు వచ్చినప్పుడు చేబ్రోలు రైల్వేస్టేషనులో ఆయనను చూశారు. అప్పటి నుంచి గాంధీ మార్గంలోనే నడిచారు. గాంధేయవాదిగా ముద్ర వేసుకొని సత్యం, అహింస, స్వదేశీ విధానాలను తాను ఆచరించడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా వాటికి విశేష ప్రచారం కల్పించారు. మాంసాహారానికి దూరంగా ఉన్నారు. చిన్నతనం నుంచే ఖద్దరు వస్త్రాలను ధరించడం మొదలు పెట్టారు. తన పక్క గ్రామమైన పెదనిండ్రకొలనులో పార్లమెంటు నమూనాలో గాంధీభవనం నిర్మించి ప్రజల స్మృతిపథం నుంచి మహాత్ముని చెరిగిపోకుండా చేశారు. సర్వోదయ ఉద్యమానికి ఊపిరులూదారు. 1955లో వినోభాబావే భూదానోద్యమంలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు 100 ఎకరాల భూమిని దానం చేశారు. 1961లో ఉంగుటూరు మండలం నాచుగుంటలో అఖిల భారత సర్వోదయ సమ్మేళనం నిర్వహంచారు.
విద్యారంగంపై తిరుగులేని ముద్ర: విద్యారంగంలో మూర్తిరాజు తనదైన ముద్ర వేశారు. భీమవరం, ఏలూరు నగరాలకే పరిమితమైన విద్యను గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చిన ఘనత ఆయనదే. తాను ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివినా చదువు విలువ గుర్తించి ప్రతి ఒక్కరూ విద్యావంతులను చేయాలనే తపన పడేవారు. బాపిరాజు ధర్మసంస్థ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. వాటన్నింటికి దేశ నాయకుల పేర్లు పెట్టారు. కుటుంబంలో మహిళ చదువుకుంటే ఆ ఇల్లంతా విద్యావంతులవుతారనేది ఆయన దృఢ విశ్వాసం. అందుకోసం ఆయన జీవితాంతం కృషి చేశారు. కళల్ని సాహిత్యాన్ని ప్రేమించే మూర్తిరాజు కళాకారులకు ఎందరికో ఉపాధి చూపించారు. భూరి విరాళాలిచ్చి అభినవ భోజుడిగా పేరుపొందారు.. నేడు సినీరంగంలో ప్రముఖ హాస్య నటునిగా కొనసాగుతున్న ఎంఎస్‌ నారాయణ, పురాణ వ్యాఖ్యాత మైలవరపు శ్రీనివాసరావు ఆయన నెలకొల్పిన పాఠశాలల విద్యార్థులే. ప్రముఖ రచయిత, నటులు పరుచూరి గోపాలకృష్ణ ఆయన స్థాపించిన కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. మాజీ మంత్రులు దండు శివరామరాజు, మరో మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజులు ఆయన శిష్యులే.

ఆరు సార్లు ఎమ్మెల్యేగా: చిన్ననాటనే రాజకీయాల్లో ప్రవేశించి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1952 నుంచి 1982 వరకు తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, పెంటపాడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెటింగు, గిడ్డంగులు, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రోటెం స్పీకరుగా కూడా పనిచేశారు.

ఆశయం..కొల్లేరు జిల్లా: దుర్భర దారిద్య్రంతో అలమటిస్తున్న కొల్లేరు ప్రజల అభ్యున్నతికి కృషి చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో కొన్ని ప్రాంతాలను కలిపి కొల్లేరును జిల్లాగా చేయాలన్న ఆయన ఆశయం నెరవేరలేదు. ఈ విషయంపై అనేకమంది ముఖ్యమంత్రులతో పోరాటాలు కూడా చేశారు.
మూర్తిరాజు ఆశించిన మేరకు గాంధీభవన్‌ ఆవరణలోనే బుధవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూర్తిరాజు మృతికి తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

courtesy with Eenadu news paper-14/11/2012
  • =======================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment