Thursday, March 14, 2013

Bezawada Gopala Reddy,బెజవాడ గోపాలరెడ్డి

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Bezawada Gopala Reddy,బెజవాడ గోపాలరెడ్డి -- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

తొలితరం స్వాతంత్య్ర సమరయోధు డు, గాంధేయవాది, సాహితీవేత్త బెజ వాడ గోపాలరెడ్డి సౌమ్యుడే కాక, వివాదరహితుడైన రాజకీయవేత్త. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిపక్షాలు కూ డా ఎన్నడూ వేలెత్తి చూపిన దాఖలాలు లేవంటే ఆయన రాజకీయ ఔన్నత్యం ఎంతటి ఉదాత్తమైనదో అర్థమవుతుంది. 1907 ఆగస్టు 7న నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన బెజవాడ గోపాలరెడ్డి, 1927లో శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. టాగోర్ గోపాలరెడ్డికి గురుతుల్యులు, దైవ సమానులు కూడా. జీవితంలో ప్రతిమెట్టు విశ్వకవి ఆశీస్సులతోనే అధిరోహించానని సగర్వంగా చెప్పుకునేవారు. టాగోర్ జన్మదినం నాడే బ్రహ్మసమాజ పద్ధతిలో లక్ష్మీకాంతమ్మను ఆయన వివాహం చేసుకున్నారు.

గాంధీజీ ఉపన్యాసాలతో ఉత్తేజితులైన గోపాలరెడ్డి ప్రాథమిక విద్యను మధ్యలోనే ఆపి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. అనేక పర్యాయాలు నిర్బంధానికి గురై జైలుశిక్షను అనుభవించారు. 1931లో అతి పిన్నవయసులో ఏఐసీసీ సభ్యులుగా, 1937లో రాజాజీ నేతృత్వంలో ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మంత్రిగా నియమితులయ్యారు. ‘జమీందారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ మంత్రివర్గంలో గోపాలరెడ్డిని ఎలా చేర్చుకున్నారు?’ అని ప్రశ్నించిన రాజాజీ అనుచరులకు ‘విద్యాధికుడైన శ్రీమంతుడిని అధికారంలో కూర్చోబెడితే కాసులకు కక్కుర్తిపడకుండా నిజాయతీతో పాలన చేస్తాడు’ అని నవ్వుతూ సమాధానం చెప్పడం విశేషంగా చెప్పుకునేవారు. స్వాతంత్య్రానంతరం ప్రకాశం పంతులు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా, 1955లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించాక నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన గోపాలరెడ్డి జాతీయస్థాయిలో నెహ్రూ మంత్రివర్గంలో సమాచార మంత్రిగా విశిష్టమైన సేవలు అందించారు. ప్రజోపయోగం కాని సిఫారసులను సున్నితంగా తిరస్కరించేవారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన గోపాలరెడ్డి, తదనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బెంగాలీ, హిందీ, ఒరియా, గుజరాతీ మొదలైన పదకొండు భారతీయ భాషలు సహా ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్న గోపాలరెడ్డి సాహితీ ప్రియులు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, తెలుగు భాషాసమితి అధ్యక్షులుగా ఎనలేని సేవలందించారు. టాగోర్ రచనలు అనేకం ఆంధ్రీకరించారు. 1997 మార్చి 9న 88వ ఏట తుదిశ్వాస వదిలే వరకూ సాహితీ లోకంలో క్రియాశీలంగా ఉన్నారు. వానచినుకులు, ఊర్వశి, నైవేద్యం, ఆమె, గులాబీ రేకలు, హంసతూలిక ఆయన రచనల్లో కొన్ని. నాలుగు విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్‌లతో సత్కరించడం విశేషం. సాహిత్య బంధువు, అభినవ భోజుడు వంటి మరెన్నో బిరుదులు ఆయనను వరించాయి. సౌమ్యులు, సాహితీ ప్రియులైన నిష్కళంక రాజకీయవేత్త బెజవాడ గోపాలరెడ్డి జీవితాచరణ నుంచి నేటి రాజకీయ నాయకులు స్ఫూర్తి పొందాలి.

-వేమూరి జగపతిరావు లంకపల్లి, కృష్ణా జిల్లా-(నేడు బెజవాడ గోపాలరెడ్డి 15వ వర్ధంతి)@http://www.sakshi.com/
  • =======================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment