Thursday, March 14, 2013

Puttaparti Narayanacharyulu,పుట్టపర్తి నారాయణాచార్యులు

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Puttaparti Narayanacharyulu,పుట్టపర్తి నారాయణాచార్యులు - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

              
పద్నాలుగేళ్ల వయసులో ‘పెనుగొం డలక్ష్మి’ అనే పద్యకావ్యాన్ని రచించి అనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ, పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్రంథాలను రచించిన ఘనత ‘సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణాచార్యులకే సొంతం. 1914 మార్చి 28న అనంతపురం జిల్లా, పెనుగొండ సమీపంలోని చియ్యేరు గ్రామంలో విద్యావంతుల కుటుంబంలో పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మించారు. ప్రాథమిక విద్య అనంతరం సంస్కృతంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి పదహారవ ఏట తిరుపతి ఓరియంటల్ కళాశాలలో చేరడానికి దరఖాస్తు చేసుకున్న పుట్టపర్తికి ప్రవేశం దొరకలేదు. దాంతో దెబ్బతిన్న అభిమానంతో కళాశాల ప్రిన్సిపాల్ ఎదుటే ఐదు శ్లోకాలను సంస్కృతంలో ఆశువుగా చదివి, నిష్ర్కమించిన పుట్టపర్తి కవితా ధారణను చూసి సంబరపడ్డ ప్రధానాచార్యులు, ఆయన కోరిన తరగతికన్నా పైతరగతిలో ప్రవేశం కల్పించారు.

1938లో నారాయణాచార్యులు ‘విద్వాన్’ పరీక్షకు హాజరయినప్పుడు, తాను రచించిన ‘పెనుగొండలక్ష్మి’ పద్య కావ్యం పాఠ్యగ్రంథంగా దర్శనమివ్వడం ఓ అసాధారణ సన్నివేశం. ‘‘ఇలాంటి అనుభవం ఎదురుకావడం కన్నా గొప్ప గుర్తింపు, ఒక సాహితీవేత్తకు మరేముంటుంది’’! అంటూ పుట్టపర్తి ఎంతగానో సంబరపడ్డారు. ‘షాజీ’ అనే మరో గ్రంథాన్ని పుట్టపర్తి అతి చిన్న వయసులోనే రచించి కనీవినీ ఎరుగని ఓ కొత్త రికార్డు సృష్టించారని విమర్శకులంటారు. తెలుగు తీరాలు, మేఘదూతము, సాక్షాత్కారము, అగ్నివీణ, గాంధీజీ ప్రస్థానం వంటివి వీరి రచనల్లో కొన్ని. విశ్వనాథ రచించిన ‘ఏకవీర’ నవలను నారాయణాచార్యులు మలయాళంలోకి అనువదించారు. పుట్టపర్తి రచనలన్నిటిలోకి ‘శివతాండవం’ గొప్ప కీర్తిప్రతిష్టలను సంపాదించింది. గంభీర స్వరంతో భావోద్వేగంతో ఆయన శివతాండవం గానం చేస్తుంటే, జనం పులకించిపోయేవారు. 1974లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదుతో పుట్టపర్తి నారాయణాచార్యులను సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన పుట్టపర్తిని, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కవిగా, విమర్శకుడిగా, వాగ్గేయకారుడిగా, అనువాదకుడిగా, వ్యాఖ్యాతగా, అవధానిగా తెలుగు సాహితీక్షేత్రంలో విశేష ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించిన నారాయణాచార్యులు అపర సరస్వతీ పుత్రులు. తెలుగు సాహిత్యంలో ఆయన కీర్తి అజరామరం. ‘‘నాకు మంత్రోపాసన వల్ల ఏమీ తృప్తి కలగలేదు. దానితోపాటు గృహఛిద్రాలు నన్ను కలవరపెట్టాయి. దేశంలోని సన్యాసులందర్నీ కలవాలని ఉంది’’ అంటూ బెనారస్, హరిద్వార్, హిమాలయాల గుండా రుషీకేశ్ దాకా కాలినడకన పర్యటించి, మార్గమధ్యంలో స్వామి శివానంద సరస్వతి ఆశీర్వాదాలతో ‘సరస్వతీపుత్ర’ బిరుదును పొందిన పుట్టపర్తి 1990 సెప్టెంబర్ 1న, 76వ ఏట కన్నుమూశారు.


-వీణా రమాపతిరాజు హైదరాబాద్-(నేడు పుట్టపర్తి నారాయణాచార్యులు 22వ వర్థంతి)-@ http://www.sakshi.com/
  •  =========================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment