మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Chinnapa Reddy,చిన్నపరెడ్డి- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
వంద సంవత్సరాలు వెనక్కివెళితే వీరుల త్యాగాల జాడలు కనపడ తాయి. వారు కన్న కలలూ, నిర్మించాలనుకున్న స్వేచ్ఛాభారతం కోసం ప్రదర్శించిన పట్టుదల మన ముందున్నాయి. బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా మారిన చిన్నపరెడ్డి లాంటి దేశభక్తుల పోరాట చరిత్రను నేటి తరాలకు అందించాల్సిన కర్తవ్యం మనపై ఉంది. గాదె చిన్నపరెడ్డి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో గాదె సుబ్బారెడ్డి, లింగమ్మ దంపతులకు 1864లో జన్మించాడు. ధైర్యశాలి. ఆజానుబాహుడు. చిన్నతనం నుంచే గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. 1907లో మద్రాసు సంతకు వెళ్లినప్పుడు అక్కడ జరిగిన సభలో బాలగంగాధర తిలక్ రగిల్చిన దేశభక్తి ప్రభావం చిన్నపరెడ్డిపై పడింది. దాంతో తిరిగి గ్రామానికి వచ్చినప్పుడు స్వరాజ్యం కావాల్సిందే అంటూ గ్రామంలో ప్రజల్ని కూడగట్టాడు. బ్రిటిష్ పాలకులు విధించిన వివిధ రకాల పన్నులకు వ్యతిరేకంగా ప్రజల్ని సంఘటితం చేసి పోరాడాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా చిన్నపరెడ్డి ప్రదర్శించిన ధైర్యసాహసాల్ని ప్రజలు కథలు కథలుగా పాటల రూపంలో నేటికీ పాడుకుంటూనే ఉన్నారు.
గుంటూరు జిల్లా నర్సరావుపేటకి దగ్గరలో ఉన్న కోటప్పకొండ శైవులకు పుణ్యక్షేత్రం. 1909, ఫిబ్రవరి 18న శివరాత్రి. ఆ రోజు చిన్నపరెడ్డి 60 అడుగుల ప్రభను సిద్ధం చేసుకొని అలంకరించుకొన్న తన ఎద్దులతో కోటప్పకొండకు తన అనుచరులతో వెళ్లాడు. ఊహకందని జనసందోహం వలన తన ఎద్దులు అదుపు తప్పాయి. తన ప్రాణంకన్నా మిన్నగా చూసే నోరులేని ఎద్దులను బ్రిటిష్ పోలీసులు అతిక్రూరంగా తుపాకులతో కాల్చిచంపారు. చిన్నపరెడ్డిని అరెస్టు చేశారు. చిన్నపరెడ్డిని విడుదల చేయాలనీ, పరాయిపాలన వద్దనీ, స్వాతంత్య్రం కావాలనీ, వందేమాతరమంటూ ప్రజలు నినదించారు. పోలీసులు కాల్పులు జరిపారు. ఇద్దరు యువకులు మరణించారు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసు జవానులు కూడా మరణించారు. ఈ సంఘటనని సాకుగా తీసుకొని బ్రిటిష్ ప్రభుత్వం చిన్నపరెడ్డి మీద, అతని వంద మంది అనుచరుల మీద కేసు పెట్టింది. 21 మందికి ఉరిశిక్షలూ, 24 మందికి కఠిన శిక్షలు విధిస్తూ గుంటూరు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఐషర్ కార్షన్ తీర్పు చెప్పాడు. చిన్నపరెడ్డి దీన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టుకి వెళ్లాడు. మీకు కావాల్సింది నేను కాబట్టి నన్ను ఉరితీయండి, మిగిలిన వారిని వదిలివేయమన్నాడు.
ఆ దేశభక్తుడి మాటలు బ్రిటిష్ పాలకుల చెవికెక్కలేదు. 1910 ఆగస్టు 13న చిన్నపరెడ్డికి ఉరిశిక్షనూ, 21 మందికి ద్వీపాంతర శిక్షలను విధిస్తూ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి మన్రో తీర్పు చెప్పాడు. దేశ విముక్తి కోసం చిన్నపరెడ్డి చిరునవ్వుతో ఉరితాళ్లని ముద్దాడాడు. చిన్నపరెడ్డి ఉరితో జిల్లా ప్రజలు బెదరలేదు. ‘సై... సైరా... చిన్నపరెడ్డి, నీ పేరు బంగారపు కడ్డీ’ అని ఆయన త్యాగాన్నీ, దేశభక్తిని ప్రజలు గానం చేశారు. వందేమాతరం ఊపిరిగా ఉరికొయ్యని దిక్కరించిన చిన్నపరెడ్డి వంటి దేశభక్తులు నడియాడిన స్థలాలను, వారు జీవించిన ఇళ్లను చారిత్రక స్మృతి కేంద్రాలుగా తీర్చిదిద్ది భావితరాలకు స్ఫూర్తినిచ్చేందుకు అందించాలి. వారి చరిత్రను పాఠ్యపుస్తకాలలో పొందుపరచాలి. ఆ అమరులకు వారసులుగా, సామ్రాజ్యవాద పెత్తనం లేని దేశం కోసం పోరాడదాం. మన దేశభక్తులు కన్న కలల్ని నిజం చేద్దాం.
చిట్టిపాటి వెంకటేశ్వర్లు సీపీఐ ఎంఎల్-న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు
(బ్రిటిష్ సర్కార్‌తో చిన్నపరెడ్డి పోరుకు నాంది పలికి నేటి (శివరాత్రి)కి 103 ఏళ్లు)-@http://www.sakshi.com/
- =========================
No comments:
Post a Comment