Tuesday, July 23, 2013

Kondapalli Seshagirirao,కొండపల్లి శేషగిరిరావు(చిత్రకారుడు)




మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Kondapalli Seshagirirao,కొండపల్లి శేషగిరిరావు(చిత్రకారుడు)- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



పుట్టిన తేదీ : 27 జనవరి  1924.
పుట్టిన స్థలము : మహబూబబాద్  - హైదరాబాద్ కి దగ్గరిలో,
తండ్రి : గోపాలరావు ,
 తల్లి : రామచూడామణి ,


కోటిరత్నాల వీణ తెలంగాణలో వేయిస్తంభాల గుడి, అరుదైన చారిత్రక కళాసంపదను చాటుతున్న వరంగల్‌ ప్రాంతంలో జన్మించిన కొండపల్లి శేషగిరిరావు చిన్నతనం లోనే ఆయనలోని సృజనాత్మకతను పరిశీలించిన ఆ పాఠశాల డ్రాయింగ్‌ మాస్టర్‌ దీనదయాళ్‌ ఆనాడే కొండపల్లి గొప్ప కళాకారుడవుతాడని గ్రహిం చారు. చుట్టూ వ్యాపించి ఉన్నకళాసంపద ఆయన కళాభిమానాన్ని తట్టిలేపింది. వేయిస్తం భాల గుడిలోని ప్రతీ స్తంభం ఆయనకు రోజుకో పాఠం చెప్పింది. రామప్ప గుడి ఆయన్ని తన హృదయాంతరాలలో నింపుకుంది. ఆ గుడిలోని శిల్ప సౌందర్యం.. శిల్పక్షేత్రాల శిల్ఫకళా సొగసుల ను సుదీర్ఘ, సునిశిత అధ్యయనంతో తన సొంతం చేసుకొన్న కొండపల్లి వాటినుంచి స్ఫూర్తిపొంది కొన్ని వందల చిత్రాలతో ఆ శిల్ఫకళకు దర్ఫణం పట్టారు. శిల్పుల మనోగతా ల్ని, వారి అభిరుచిలో తొంగిచూసిన ప్రత్యేకతల్ని, విశిష్టతల్ని తాను అవగతం చేసుకోవడమే కాక ప్రజా బాహుళ్యానికి చాటే ప్రయత్నం చేశారు.

-తెలుగు చిత్రకళా ప్రపంచంలో ఓ వటవృక్షం. చిత్రకళకు అత్యంత కీర్తిని, బాహీర్‌ సౌందర్యాన్ని మాత్రమే కాకుండా ఆత్మ సౌందర్యాన్ని సమకూర్చిన కొండపల్లి శేషగిరిరావు.భారతీయ ఇతిహాసాలను చిత్రిక పట్టడంలో శేషగిరిరావుది అందె వేసిన చేయి. ప్రకృతి, చారిత్రక గాథలను.. ముఖ్యంగా కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆయన సజీవ చిత్రాలుగా మలిచారు. ఆక్వా టెక్స్‌చర్‌ పెయింటింగ్‌లకు ఆయన మార్గదర్శకుడిగా చెబుతారు. లండన్‌, అమెరికా, మాస్కో తదితర దేశాల్లో జరిగిన ఎగ్జిబిషన్లలో శేషగిరిరావు చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. సాలార్‌జంగ్‌ మ్యూజియం సహా వాషింగ్టన్‌ డీసీలోని భారత రాయబార కార్యాలయం, పిట్స్‌బర్గ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయాలకు ఆయన చిత్రాలు మరింత శోభను తీసుకువచ్చాయి.

మనం అంటే ఇది అని కళ్లకు కట్టేలా చెప్పిన కళాకారుడు కొండపల్లి శేషగిరిరావు. నలభై ఏళ్ల క్రితం పోతన ముఖచిత్రంగా వచ్చిన ఆంధ్రపత్రికను రంగుల్లో చూసి వందలాది తెలుగువారు ఫ్రేములు కట్టించుకున్నారు. కొండపల్లి ప్రతిభకు నీరాజ నాలు పలికారు. అంత అందం, అంత ప్రశాంతత, అంత భక్తి భావం ఆ చిత్రంలో ఒలికించారు. పోతన భాగవతాన్ని 16 సార్లకు పైగా చదివి, మనోలోకాల్లో కాలయానం చేసి కొండపల్లి చిత్రించారు. అందుకే దానికి అంత జీవం వచ్చింది. అజంతా, ఎల్లోరా, రామప్ప, రాచకొండ,

లేపాక్షి తదితర చారిత్రక చిత్రకళా కేంద్రాలను పర్యటించి, తన భావానుగుణంగా వరూధినీ- ప్రవరా ఖ్యుడు, రాణి రుద్రమ, గణపతి దేవుడు, శకుంతల చిత్రాలను చిత్రించారు. తొలి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కొండపల్లి శేషగిరిరావు తెలుగు తల్లిని సాక్షాత్కరింపజేశారు. ఆ చిత్రం ఆధారంగానే తెలుగు తల్లి విగ్రహాలనూ రూపొందించారు. అదే సందర్భంలో అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు దృశ్యరూపం ఇవ్వవలసినదిగా కొండపల్లిని కోరారు. విశ్వామిత్రుడు వంటి ఐతిహాసిక వ్యక్తుల నుంచి, శాతవా హనులు, విష్ణుకుండినులు, పల్నాటి బ్రహ్మనాయుడు వంటి చారిత్రక వ్యక్తుల నుంచి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ వరకూ తన చిత్రంలో నీరాజనం పలికారు కొండపల్లి. అన్నమయ్య, త్యాగయ్య వంటి వాగ్గేయకారులు, జానపద కళాకారులు అంతా.. అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పు ఉన్న శేషగిరిరావు గారి మహత్తర చిత్రంలో కొలువుదీరారు. తెలుగు చిత్రకళను అంతర్జాతీయ వేదికపై సగౌరవంగా ఆవిష్కరించిన కొద్దిమందిలో శేషగిరిరావు ఒకరు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్ర్తి, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీలతోపాటు ఎంతో మంది ప్రముఖులు ఆయన చిత్రాలను మెచ్చుకున్నారు. తెలంగాణ కాకిపడగలు, రామప్పదేవాలయం విశిష్టతను వివరించిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయనే. 1975లో ప్రపంచ తెలుగుమహాసభలకు ఆయన రూపొందించిన తెలుగుతల్లి పెయింటింగ్‌ ప్రశంసలు పొందింది. 1994 లో శేషగిరిరావును అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రత్యేకంగా సత్కరించారు. సంగీత ఆంధ్ర విజ్ఞాన కోశం ఎడిటర్‌ లక్ష్మిరంజన్‌, మ్యాక్స్‌ ముల్లర్‌భవన్‌ డైరెక్టర్‌ పీటర్‌ స్విడ్జ్‌ల అభినందనలు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలిండియా ఫైన్‌ఆర్ట్‌‌స అండ్‌ క్రాఫ్ట్‌ సొసైటీల గౌరవం పొందారు.

హైదరాబాద్‌ మైసూర్‌, మద్రాస్‌, ఆలిండియా ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌, కోల్‌కతా అకాడమీ ఆఫ్‌ ఫైనార్ట్‌, ఏపీ లలిత కళా అకాడమీ అవార్డులను అందుకున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ పక్షాన 1988లో ఎమిరిటస్‌ ఫెలోషిప్‌ను, తెలుగు యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్‌ను ఆయనకు అందజేశారు. ప్రతిష్ఠాత్మక హంస అవార్డును కూడా ఆయన అందుకున్నారు. ఆర్ట్స్ సురేఖ అనే పుస్త్తకాన్ని రాశారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన సృష్టించిన చిత్రాలు ఉంటాయి.



Courtesy with Surya Telugu daily news paper 04 jan 2013.
  • ========================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment