మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ-కొవ్వలిలక్ష్మీనరసింహరావు(రచయిత)- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
Kovvali Lakshmi Narasimharao(writer),కొవ్వలి లక్ష్మీనరసింహరావు(రచయిత)--By Ravi kondalarao Courtesy with Sitara cinima news magazine
ఆ రోజుల్లోని మధ్యతరగతి స్త్రీలకు పుస్తకాలు చదవడం నేర్పిన గొప్ప రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహరావు. అవి- ఆయన రాసిన నవలలు. ''కొవ్వలి వారి నవలలు'' అంటే, ఆనాడు విపరీతమైన అభిమానం ఉండేది. కొత్త నవల మార్కెట్‌లోకి వచ్చిందంటే చాలు- అమ్ముడయిపోయేది. 64 పేజీల నవల. కొందరు ఇంటికి తెచ్చి అద్దెకిచ్చేవారు. ఒక రోజు పుస్తకానికి 'కాణీ' అద్దె. నవల వెల రెండు అణాలు. ఈ నవలల్లోని కథలు మామూలు కుటుంబ కథలు. మంచి వ్యావహారిక భాషలో, సహజమైన సంభాషణలతో రాసేవారు ఆయన. ఇవాళ కాలక్షేపానికి, టీవీ సీరియళ్లు చూసినట్టు- ఆ రోజుల్లో కొవ్వలి పుస్తకాలు గొప్ప కాలక్షేపం. రైలు ప్రయాణంలో ప్రతి వారి చేతిలోనూ కొవ్వలి నవల ఉండేది. ఈ చదివించే ధోరణిని- ఆయనే ప్రవేశపెట్టారు. అది ఒక యుగం! అప్పట్లోనే, ఆయన రాసినట్టుగానే ఇంకా మరికొందరు రచయితలు నవలలు రాస్తూ వచ్చారుగాని, ప్రథమ స్థానం కొవ్వలిదే. కొవ్వలి వారి కలం... ఇప్పటికీ మరువలేం!
నా చిన్నతనంలో మా ఎదురింటావిడ- మేము తెచ్చుకున్న నవల కోసం వచ్చేవారు. వేరే రచయిత రాసిన నవల ఏదైనా ఇస్తే ''ఇది వద్దురా. కొవ్వలి రాసినది లేదా?'' అనేవారు. మా ఇంట్లో- మా అమ్మ, వదినలు, మా అన్నయ్య మేమూ అందరం చదివేవాళ్లం. అందరూ చదవదగ్గ పుస్తకాలు అవి!
సినిమా వారు బాగా వాడుకున్న కొవ్వలి వారు- తణుకులో 1-7-1912న పుట్టి, పై చదువులు చదువుకున్నారు. అప్పుడు వచ్చిన సాహిత్యాన్ని మధించారు. స్త్రీల సమస్యలతో, వాడుక భాషలో చిన్న చిన్న కథలు తీసుకుని నవలారూపంలో రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే- ఆయనకి ఖ్యాతి తెచ్చింది. అప్పట్లో మధ్య తరగతి స్త్రీలకు పెద్ద చదువులు ఉండేవి కావు. పటాటోపం, ఆర్భాటంతో ఉన్న గ్రంథాలు వాళ్లు చదవలేరు, అర్థం చేసుకోలేరు. అంచేత వాడుక భాషలో రాస్తే- పఠనయోగ్యం అని కొవ్వలి భావించారు. రాసిన మొత్తం నవలల సంఖ్య 1000కి పైగా! 1935లో 'పల్లె పడుచులు' పేరుతో రాసిన నవల మొదటిది కాగా, వెయ్యో నవల పేరు- 'మంత్రాలయ'. వేయిన్నొకటి- 'కవి భీమన్న' (1975). నటీమణి సూర్యకాంతం ఆయన నవలల్ని తెగ చదివేవారు గనక, వెయ్యో నవలని ఆమెకి అంకితమిచ్చారు- కొవ్వలి వారు. అయితే, ఆయన రాసిన వాటిలో జానపదాలు, డిటెక్టివ్ కథల్లాంటివి కూడా ఉన్నాయి.
కథ అల్లడంలోనూ, మాటలు రాయడంలోనూ కొవ్వలి వారికి ఉన్న రచనా సహజత్వాన్ని నిదానంగా సినిమా ఉపయోగించుకుంది. రాజరాజేశ్వరి వారు 1941లో 'తల్లి ప్రేమ' తీసినప్పుడు కొవ్వలి వారిని ఆహ్వానించి, కథ, మాటలూ రాయించారు. కన్నాంబ, కడారు నాగభూషణంగార్లు ఈ సినిమాతో చిత్రరంగంలో నిర్మాతలయినారు. జ్యోతిసిన్హా దర్శకత్వం వహించగా, కన్నాంబ, సి.యస్.ఆర్. ముఖ్యపాత్రలు ధరించారు. ఇంకో విశేషం ఏమిటంటే, అక్కినేని నాగేశ్వరరావుకి నిజానికి ఇది మొదటి సినిమా అయేది. ఈ సినిమాలో వేషం ఉందని మద్రాసు తీసుకెళ్లారుగాని, అనుకున్న వేషానికి పెద్దవాడయిపోతాడని, ఇంకో వేషం ఇద్దామని- కూచోబెట్టారుగాని, ''వేషం రాక'' ఇంటికి పంపేశారు. తర్వాత వచ్చింది 'ధర్మపత్ని'లో ఒక చిన్న వేషం.
కొవ్వలి లక్ష్మీనరసింహరావు గారికి ఆత్మాభిమానం, మొహమాటం రెండూ ఎక్కువే. 'తల్లి ప్రేమ' బాగా నడిచినా, మద్రాసులోనే మళ్లీ సినిమా ప్రయత్నాలు చేయలేదు. తన వూరు వెళ్లిపోయారు. మళ్లీ- పదేళ్లకి కొవ్వలి వారి నవలనే సినిమాగా తియ్యాలని వినోదావారు భావించి, మద్రాసు రప్పించారు. నిర్మాత డి.ఎల్. నారాయణగారు, వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో నిర్మించిన ''శాంతి'' చిత్రం 1952లో విడుదలైంది. 'శాంతి'లో దాదాపు అందరూ కొత్తవారే. ఈ సినిమా బాగా నడవడంతో, కొవ్వలి వారిని మద్రాసులోనే ఉండమని ప్రోత్సహించడంతో- ఆయన ఉండిపోయారు. కొవ్వలి వారికి పారితోషికంగా, పడమటి మాంబళంలో ఒక స్థలం కొని ఇచ్చారుట డి.ఎల్. (ఆ స్థలం ఇప్పటికీ ఆ కుటుంబంలోనే ఉంది).
విక్రమ్ ప్రొడక్షన్స్ పేరుతో బి.ఎస్.రంగా తీసిన 'మా గోపి' సినిమాకి లక్ష్మీనరసింహరావు గారు కథ, మాటలూ రాశారు. చిన్న పిల్లవాడు ప్రధాన పాత్రగా నడిచిన ఈ సినిమా బాగా నడిచింది. వెంకటేశ్ అనే బాలుడు ఆ ముఖ్య పాత్రని వేశాడు. జమున ముఖ్య పాత్రధారిణి. 'సిపాయి కూతురు' (1959) కొవ్వలి వారి కథే. మాటలూ ఆయనే రాశారు. 'చందమామ' సంస్థ పేరుతో డి.ఎల్. నారాయణ తీసిన ఈ సినిమాని చెంగయ్య డైరెక్టు చేశారు. ఈ సినిమా చూపించిన విశేషం ఏమిటంటే- సత్యనారాయణని తొలిసారిగా 'హీరో' పాత్రలో పరిచయం చేసింది. నాయిక- జమున. హెచ్.ఎమ్.రెడ్డి గారి పర్యవేక్షణలో వచ్చిన రోహిణి వారి 'బీదల ఆస్తి' (1955), 'రామాంజనేయ యుద్ధం (1958)' చిత్రాలకు కొవ్వలి రచన చేశారు. 'మహాసాధ్వి మల్లమ్మ' అనే కన్నడ చిత్రానికి తెలుగులో రచన చేసి ఇచ్చారు.
అయితే జానపద కథల్ని అల్లడంలో కొవ్వలికి మంచి ప్రతిభ ఉందని, అలాటి కథలతో చిత్రాలు తీసిన నిర్మాతలు ఆయన్ని పిలిచి, చర్చల్లో కూచోబెట్టేవారు. కొందరు రచయితలకి 'నేపథ్య రచన' చేసిన విశేషం కూడా ఉంది ఆయనకి.
ఒకసారి భానుమతి గారు ఏదో సందర్భంలో చెప్పారు. ''రైళ్లలో కొవ్వలి నవల చదువుతూ, అందులో లీనమైపోయి, దిగవలసిన స్టేషను వస్తే దిగడం మరచిపోయేవారు'' అని.
1973లో కొవ్వలి వారికి మద్రాసులోనే షష్ట్యబ్ది పూర్తి మహోత్సవం జరిగింది ఘనంగా. ఆ సందర్భంగా ప్రత్యేక సంచిక వెలువరించారు. ప్రముఖ రచయితలందరూ వ్యాసాలు రాసి అభినందించారు. ఆ సమయంలోనే- నేను కొవ్వలి వారిని కలుసుకోవడం జరిగింది. ఒకటి రెండుసార్లు కలుసుకుని మాట్లాడాక- అప్పుడు నేను చిత్రాల్లో పాత్రధారణ చేస్తున్నాను- 'విజయచిత్ర'లో పని చేస్తున్నాను. 'చిన్న తనంలో మీ నవలలతో నేను పెరిగాను' అని ఆనందంగా చెబితే, సంతోషించారు. 'విజయచిత్ర'లో ''మీతో ఇంటర్వ్యూ వెయ్యాలని ఉంది. మీ సినిమా అనుభవాలు చెబితే రాసుకుంటాను- ఎప్పుడు రమ్మంటారో చెప్పండి'' అని అడిగితే, ఆయన ''అలాగే చూదాం'' అన్నారుగాని, ఉత్సాహం చూపించలేదు. ఆయనకు పబ్లిసిటీ కిట్టదని- భావించుకున్నాను. ''నా గురించి రాయడానికి ఏముంటుంది? ఇప్పుడు నన్నెవరు గుర్తుంచుకుంటారు గనక?'' అని దాటవేశారు. మొహమాటస్తుడు. తను సాధించిన గొప్పతనం చెప్పుకోడానికి ఇష్టపడని- గొప్ప వ్యక్తి అనిపించింది.
''నేను మద్రాసులోనే చదువుకున్నాను. ఆయన సినిమా వ్యాసంగం అంతా నాకు తెలుసు. ఎవరెవరు మా ఇంటికొచ్చి ఆయన్ని రచనలు చెయ్యమని అడిగారో కూడా తెలుసు. కాని, అందరికీ ఒప్పుకునేవారు కాదు. పారితోషికం విషయంలోనూ అంతే! మొహమాటమే'' అని కొవ్వలి వారి పెద్దకుమారుడు (కెనరా బాంక్ మేనేజర్‌గా పనిచేసి రిటైరయినారు) లక్ష్మీనారాయణ గారు చెప్పారు. (కొన్ని జీవిత విశేషాలు కూడా ఆయన చెప్పినవే).
ఇవాళ వస్తున్న మన సినిమా పేర్లు అప్పట్లో ఆయన తన నవలలకి పెట్టిన పేర్లలాంటివే అనిపిస్తుంది. మచ్చుకి: బస్తీ బుల్లోడు, నీవే నా భార్య, వేగబాండ్ ప్రిన్స్, కరోడా, నీలో నేను-నాలో నీవు, రౌడీ రంగన్న, హలో సార్, ఇడియట్, ఛాలెంజ్, సవాల్, పైలా పచ్చీస్, లవ్ మేకింగ్, బడా చోర్, కిడ్‌నాప్, చస్తావ్ పారిపో, సీక్రెట్ లవర్, డార్లింగ్ డాలీ- వంటివి.
ఇన్ని నవలలు రాసిన రచయిత- ఎక్కువగా సినిమాలకెందుకు రాయలేదు? అంటే, ఆసక్తి అధికంగా లేక, ధన సంపాదన మీద అపేక్ష లేక! ఎందరో ప్రచురణకర్తలు ఆయన పుస్తకాలు ప్రచురించినా- కొందరు వంద రూపాయలు మాత్రమే చేతిలో పెట్టేవారుట! ''మధ్య తరగతి స్త్రీలకు ఆమోదకరంగా ఉండే విధంగా రచనలు చేసి, చదివించిన వారిలో ప్రథముడు కొవ్వలి'' అని, రచయిత, నిర్మాత చక్రపాణి గారి మెప్పు సొందిన కొవ్వలి లక్ష్మీనరసింహరావుగారు 8-6-1975న ద్రాక్షరామంలో మరణించారు.
సితార సహకారంతో..
- =======================
No comments:
Post a Comment