లక్షమంది ఉద్యోగుల్లోంచి, వేయిమంది మేనేజ్‌మెంట్ దిగ్గజాల్లోంచి, వందమంది గ్లోబల్ సీయీవోల్లోంచి ... ఏరికోరి సత్య నాదెళ్లనే మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎందుకు ఎంపిక చేశారు? బిల్‌గేట్స్ నమ్మకాన్ని చూరగొన్న ఆ భారతీయుడి విజయ రహస్యం ఏమిటి?
మైక్రోసాఫ్ట్ సెర్చ్ కమిటీ... సమర్ధుడైన నాయకుడి కోసం ప్రపంచమంతా అంజనమేసి గాలించింది. వేల రెజ్యూమేలు సేకరించింది. వృత్తి నైపుణ్యాల్నీ వ్యక్తిగత చరిత్రల్నీ బేరీజు వేసి, వందమందిని ప్రాథమికంగా ఎంపిక చేసింది. అనేకానేక వడపోతల తర్వాత ... ఓ పాతికమంది మీద దృష్టిపెట్టింది.
స్టీఫెన్ ఎలొప్--మాజీ సీయీవో, నోకియా
స్టీవ్ మలెన్‌కాఫ్--చీఫ్ ఎగ్జిక్యూటివ్, క్వాల్కమ్
జాన్ డానహో--సీయీవో, ఇ-బే
పాల్‌మారిడ్జ్--మాజీ సీయీవో, వీఎమ్‌వేర్
సుందర్ పిచాయ్--సీనియర్ వైస్-ప్రెసిడెంట్, గూగుల్
ఆ జాబితాలో సత్య కంటే విద్యావంతులున్నారు, అనుభవ సంపన్నులున్నారు. అయినా బిల్‌గేట్స్, నలభై ఆరేళ్ల భారతీయుడి వైపే ఎందుకు మొగ్గు చూపారు? 'ఈ కీలకమైన మలుపులో మైక్రోసాఫ్ట్‌కు సత్యలాంటి నాయకుడే కావాలి' అన్న నిర్ధరణకెందుకు వచ్చారు? ఇది ఒకరోజులో జరిగిన తీర్మానం కాదు. రెండు దశాబ్దాల సునిశిత పరిశీలన తర్వాత తీసుకున్న నిర్ణయం.
సాంకేతిక నైపుణ్యం, మేనేజ్‌మెంట్ సామర్ధ్యం - ఏ వ్యాపార నాయకుడికైనా ఉండితీరాల్సిన అర్హతలు. వీటికి అదనంగా...ఆయనలోని నిబద్ధత, సంస్థ పట్లా వృత్తి పట్లా అంకిత భావం, నిరాడంబర జీవనశైలి, నలుగుర్నీ కలుపుకు పోయే స్వభావం - అంతమందిలోనూ సత్యను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
కొత్తగా పోటీ ప్రపంచంలోకి అడుగుపెట్టే తాజా పట్టభద్రులకు సత్య ఓ స్ఫూర్తి. కోటి కలల్ని కళ్లలో నింపుకుని అమెరికా విమానం ఎక్కే యువతీయువకులకు సత్య ఓ గెలుపు పాఠం. ఇప్పుడిప్పుడే ఆలోచనలు రెక్కలు తొడుగుతున్న విద్యార్థినీ విద్యార్థులకు సత్య ఓ ఐటీ సూపర్‌స్టార్!
'మనసుంటే, తపనుంటే ఎవరైనా ఎదగొచ్చు, ఏమైనా సాధించవచ్చు. జాతి, రంగు, దేశం- అవరోధాలు కానే కాదు' అని సత్యప్రమాణంగా నిరూపించారు సత్య నాదెళ్ల.
నిత్య జిజ్ఞాస...
'నేను అంతా నేర్చేసుకున్నాను- అనుకున్న మరుక్షణం నుంచే మీ ఎదుగుదల ఆగిపోతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. జిజ్ఞాస మీలో ఓ భాగం కావాలి' - జీవితంలో గొప్పగొప్ప లక్ష్యాల్ని సాధించాలని తపించే యువతరానికి సత్య సలహా.
ఆ జిజ్ఞాసే హైదరాబాద్‌లోని బేగంపేట పబ్లిక్‌స్కూలు విద్యార్థిని సిలికాన్ వ్యాలీ దాకా తీసుకెళ్లింది, మైక్రోసాఫ్ట్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను చేసింది. మొదటి నుంచీ సత్య అసాధారణ ప్రతిభావంతుడైన విద్యార్థేం కాదు. ప్రథమ శ్రేణి కంటే ఓ మెట్టు ఎక్కువ. తను ఐఐటీలూ ఐఐఎమ్‌ల ఉత్పత్తీ కాదు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివాడు. కొద్దిమంది టీచర్లూ ప్రొఫెసర్లూ తప్పించి, తనను బాగా గుర్తుపెట్టుకున్న వాళ్లూ తక్కువే. అంటే, ఒక సాధారణ విద్యార్థి అసాధారణ శ్రమతో, అంతులేని జిజ్ఞాసతో అత్యున్నత స్థానాలకు చేరుకోవడం అసాధ్యమేం కాదని సత్య చాటిచెప్పాడు.
మైక్రోసాఫ్ట్‌లో అవకాశం వచ్చేనాటికి తను షికాగో యూనివర్సిటీలో ఎంబీయే చేస్తున్నాడు. ఉద్యోగం కోసం చదువు ఆపేయడానికి మనసొప్పలేదు. అలా అని, చదువు కోసం ఉద్యోగాన్నీ వదులుకోలేడు. తనకు బిల్‌గేట్స్ అంటే ప్రత్యేక అభిమానం. ఆయన సంస్థలో పనిచేయాలని ఎప్పట్నుంచో కలగంటున్నాడు. మధ్యేమార్గంగా... చదువు ఆపకుండానే, ఉద్యోగాన్ని కొనసాగించే ఉపాయం ఆలోచించాడు. కొలువు రెడ్‌మండ్‌లో, చదువు షికాగోలో. శుక్రవారం రాత్రి బయల్దేరి వెళ్లేవాడు. మళ్లీ సోమవారానికి ఆఫీసుకు వచ్చేవాడు. అలా రెండున్నరేళ్లు ...అవిశ్రాంతంగా శ్రమించాడు. ఇప్పటికీ అదే శ్రమతత్వం. 'ఏదో ఓ ఆన్‌లైన్ కోర్సులో పేరు నమోదు చేసుకుంటూ ఉంటా. వాటిలో పూర్తిచేసేది ఏ కొన్నింటినో అనుకోండి' అంటూ నవ్వేస్తారు కానీ, చాలా కోర్సులే చేశారు. సీయీవోగా బాధ్యతలు చేపట్టగానే మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో 'మన రంగంలో సంప్రదాయం కంటే సృజనకే గౌరవం ఎక్కువ' అని చెప్పడం ద్వారా, పరోక్షంగా తన విజయ రహస్యాన్నీ చెప్పారు.
నచ్చిన పని-మెచ్చిన సంస్థ
ఎంత గొప్ప రంగాన్ని ఎంచుకున్నామన్నది కాదు.
అది సాదాసీదా రంగమే అయినా, మనమెంత గొప్పగా పనిచేశామన్నది ముఖ్యం.
సత్య ఇంజినీరింగ్ పాసయ్యే నాటికి... భారత్‌లో ఐటీబూమ్ లేదు. ఐఐటీలూ ఐఐఎమ్‌ల విద్యార్థులు కూడా సివిల్ సర్వీసు పరీక్షలపైనే దృష్టి సారించేవారు. ఐఎఫ్‌ఎస్‌లో చేరిపోయి విదేశాంగ అధికారిగా ప్రపంచాన్ని చుట్టొద్దామనో, ఐఏఎస్ అయిపోయి డాబూదర్పం వెలగబెడదామనో కలలుకనేవారే ఎక్కువ. అందులోనూ సత్య ఓ ఐఏఎస్ అధికారి కొడుకు. స్నేహితుల్లో చాలామంది ఐఏఎస్‌లూ ఐపీఎస్‌ల పిల్లలే. ప్రయత్నించి ఉంటే తనకూ మంచి సర్వీసు వచ్చేదేమో. కానీ ఆ ఆలోచన కూడా ఉన్నట్టు కనిపించదు. టెక్నాలజీ మీదున్న మక్కువ ఆయన్ని అమెరికాలో ఎమ్మెస్ చేసేందుకు ప్రోత్సహించింది.
మనసుకు నచ్చిన ఐటీ రంగాన్ని ఎంచుకోవడం ఒక ఎత్తయితే, భావసారూప్యం ఉన్న బిల్‌గేట్స్ లాంటి వ్యక్తిని యజమానిగా, మెంటార్‌గా స్వీకరించడం మరో ఎత్తు. ఆ ఎంపిక తీరు నవతరానికి విలువైన కెరీర్ పాఠం. చాలామంది ఐటీ నిపుణులు ఉద్యోగాల ఎంపికలో జీతానికే ప్రాధాన్యం ఇస్తారు - సంస్థ గురించీ యాజమాన్యం గురించీ పెద్దగా ఆలోచించరు. అధినేత ప్రోత్సాహం అందకపోతే, సంస్థలో ప్రామాణికమైన పని సంస్కృతి అంటూ లేకపోతే ఎంత ప్రతిభావంతుడైన ఉద్యోగి అయినా పెద్దగా రాణించలేడు. కొన్ని సిలికాన్ వ్యాలీ సంస్థలు, పబ్లిక్ ఇష్యూకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.... ఎక్కడ ఇన్వెస్టర్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందో అన్న భయంతో, ఉన్నపళంగా భారతీయ సీయీవోల్ని తొలగించి అమెరికన్లనే నియమించుకున్న సందర్భాలున్నాయి. కానీ, మైక్రోసాఫ్ట్ పని సంస్కృతిలో జాతి వివక్షకు తావులేదు. బిల్‌గేట్స్ కేవలం ప్రతిభనే చూస్తారు. ప్రతిభావంతుల్నే అందలమెక్కిస్తారు. కాబట్టే, సత్య సీయీవో స్థాయికి వెళ్లగలిగారు.
విశ్వసనీయత....
ఐటీ రంగంలో ఏ ఉద్యోగీ రెండేళ్లకు మించి ఒకే సంస్థలో పనిచేయరు. ఎంతోకొంత మెరుగైన అవకాశం రాగానే...మరో కంపెనీకి మారిపోతారు. సత్య మాత్రం ఇరవై రెండేళ్లుగా మైక్రోసాప్ట్‌లోనే ఉన్నారు. ఓ సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి...అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. క్లౌడ్ కంప్యూటింగ్, బింగ్ సెర్చ్ ఇంజిన్ వ్యాపారాలకు వూపిరిపోశారు. మధ్యలో చాలా అవకాశాలే వచ్చాయి. కానీ ఆయన మైక్రోసాఫ్ట్‌కే కట్టుబడ్డారు. సంస్థ విజయంలోనే తన విజయాన్ని చూసుకున్నారు. సంస్థ ఎదుగుదలే తన ఎదుగుదల అని భావించారు. సీయీవో తుది ఎంపికలో ఆ విశ్వసనీయతకూ మంచి మార్కులు పడ్డాయి. ఏ ఉద్యోగికైనా... స్వల్పకాలిక ప్రయోజనాలకంటే, దీర్ఘకాలిక లక్ష్యాలే ప్రధానమని తన కెరీర్ ప్రణాళిక ద్వారా నిరూపించారు సత్య.
సత్య పనిని ప్రేమిస్తారు. శ్రమను గౌరవిస్తారు. తాను చేస్తున్న పని ... ఏదో ఒకరూపంలో ప్రపంచాన్ని సానుకూలంగా ప్రభావితం చేయాలని ఆకాంక్షిస్తారు. 'పనిని పనిలా చూడకండి. ప్రజల జీవితాల్లో ఉన్నతమైన మార్పుల్ని తీసుకువచ్చే ఓ మహత్కార్యంగా భావించండి. అప్పుడే మన శ్రమకో అర్థం, మన జీవితాలకో పరమార్థం' అంటారు. ఓసారి సాక్షాత్తూ సీయీవో స్టీవ్ బామర్ ఫోన్ చేసినా 'ప్రస్తుతం బిజీగా ఉన్నాను. తర్వాత మాట్లాడదాం' అని ఫోన్ పెట్టేశారట. 'టెక్నాలజీ ద్వారా కూడా సమాజాన్ని మార్చవచ్చు. ఆ సాధికారత ప్రజల జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. అయితే ఆ సత్తా అన్ని సంస్థలకూ ఉండదు. మైక్రోసాఫ్ట్‌లాంటి దిగ్గజాలు మాత్రమే ఆ బాధ్యతను సమర్ధంగా నిర్వర్తించగలవు. నేను మైక్రోసాఫ్ట్‌లో చేరడానికి ఇదో ప్రధాన కారణం' అని చెబుతారు.
మానవ సంబంధాలు...
హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్లో అయినా, మణిపాల్ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా ... సహపాఠీలకు అతను ఆత్మీయ నేస్తంగానే సుపరిచితుడు.
'కనిపించిన ప్రతిసారీ స్మైల్ ఇచ్చేవాడు'
'ఒక్క పరిచయం చాలు. జిగిరీదోస్త్ అయిపోతాడు'
'క్యాంపస్ కారిడార్‌లో బోలెడన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్లం. లోతుగా విశ్లేషించడం తనకు అలవాటు'
... సత్యలోని మనిషి కోణమే, మానవతా గుణమే చాలామందికి గుర్తుండిపోయింది. సత్య స్నేహానికి విలువ ఇస్తారు. అనుబంధాల్ని గౌరవిస్తారు. సత్య తండ్రి యుగంధర్ ఐఏఎస్ అధికారిగా రాష్ట్రంలో, కేంద్రంలో బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనలోని క్రమశిక్షణ, నిజాయతీ...సత్యకూ వారసత్వంగా అబ్బాయి. భార్య అనుపమ, ముగ్గురు పిల్లలు - ఇదీ సత్య కుటుంబం. అనుపమ తండ్రి వేణుగోపాల్ కూడా ఐఏఎస్ అధికారే. ఆదర్శ భావాలున్న వ్యక్తి ఆయన. ఆ ఇద్దరు ఐఏఎస్‌లూ తమ పిల్లల పెళ్లిని చాలా నిరాడంబరంగా జరిపించారు. కనీసం తననైనా పిలవనందుకు నాటి ప్రధాని పీవీ నరసింహారావు కాస్త నొచ్చుకున్నారట. 'నా మీద కుటుంబ ప్రభావం అపారం' అని అంగీకరిస్తారు సత్య.
కుటుంబ సభ్యులంటే ఎంత ప్రేమ చూపిస్తారో, మైక్రోసాప్ట్ సహోద్యోగులన్నా అంతే అభిమానాన్ని ప్రదర్శిస్తారు. 'సత్య చాలా ప్రత్యేకమైన వ్యక్తి. పది భావాల్ని సమన్వయం చేసుకునే శక్తీ పదిమందిని ఒక తాటిమీద నడిపించే నాయకత్వ లక్షణాలూ ఆయనకున్నాయి. తనతో కలిసి పనిచేస్తున్న వ్యక్తులు కూడా తనలా ఎదగాలని ఆకాంక్షించే గొప్ప గుణం తనకుంది' అంటారు సిల్వర్‌బర్గ్ అనే సహచరుడు. 'తనతో పదినిమిషాలు మాట్లాడినా చాలు. అప్పటిదాకా మనలోలేని కొత్త శక్తి ఏదో ఆవహించినట్టు అనిపిస్తుంది' అని కితాబిస్తారు మరో ఉద్యోగి.
సత్య మీద బిల్‌గేట్స్ ప్రభావం ఎక్కువ. 'గేట్స్ అచ్చంగా తనలాంటి వ్యక్తినే సీయీవో సీట్లో కూర్చోబెట్టారు' అని ఉద్యోగులు చెప్పుకునేంత దగ్గరి పోలికలున్నాయి ఇద్దరికీ. ఇద్దరూ మితభాషులే, ఇద్దరూ ప్రియభాషులే. 'నా నాయకత్వశైలిని తీర్చిదిద్దిన ఇద్దరు వ్యక్తులకు నేను రుణపడి ఉంటాను. వారిలో ఒకరు బిల్‌గేట్స్, మరొకరు బామర్' అని వినమ్రంగా చెబుతారు సత్య. 'ఉద్యోగంలో చేరిన కొత్తలో ఏదో ప్రాజెక్టుకు సంబంధించి... బిల్‌గేట్స్ నుంచి మెయిల్ వచ్చింది. అధినేతే నాకు ఉత్తరం రాశారంటే నమ్మలేకపోయాను. ఓ రోజంతా కూర్చుని ఎలా బదులిస్తే బావుంటుందో ఆలోచించాను' అంటూ తొలిరోజుల్ని గుర్తుచేసుకుంటారు.
నిరాడంబరత్వం...
నిన్నమొన్నటిదాకా...హైదరాబాద్‌లోని పక్కింటి వాళ్లకు కూడా సత్య మైక్రోసాఫ్ట్‌లో ఉన్నతోద్యోగి అని తెలియదు. ఏదో ఓ మోస్తరు కొలువనే అనుకున్నారు. అంత నిరాడంబరత్వం! మైక్రోసాఫ్ట్‌ను అడ్డుపెట్టుకుని ప్రచారం పొందాలనో, వ్యక్తిగతంగా బ్రాండ్ విలువ పెంచుకోవాలనో ఎప్పుడూ అనుకోరు. బయటి కార్యక్రమాలకు హాజరైన సందర్భాలూ తక్కువే. ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లకు కూడా సాధ్యమైనంత దూరంగా ఉంటారు. ఆ సంస్కారం పుస్తక పఠనంతో అబ్బింది కావచ్చు. ఆయన పర్సనల్ లైబ్రరీలో టెక్నాలజీ పుస్తకాల కంటే సాహితీ గ్రంథాలే ఎక్కువ. అందులోనూ కవిత్వానికే పెద్దపీట. 'నాకు కవిత్వమంటే ప్రాణం. వందమాటల్లో చెప్పలేని భావాన్ని ఓ చిన్న వాక్యంలో ఇమిడ్చేస్తారు కవులు. ఇదోరకంగా కంప్యూటర్ కోడింగ్ లాంటిదే' అంటారు. ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా...పుస్తకాల దుకాణాన్ని సందర్శించకుండా తిరిగిరారు. 'నిజమే, పుస్తకాలు బాగా కొంటాను. చదివేది మాత్రం తక్కువే అనుకోండి' అంటూ నవ్వేస్తారు. కాలేజీ రోజుల నుంచీ సత్య మంచి వక్త. మాటల్లో రాతల్లో కవితాత్మక వ్యక్తీకరణ ఉంటుంది. మైక్రోసాప్ట్ ఉద్యోగులకు రాసిన లేఖలోనూ ఆ కవిహృదయం తొంగిచూస్తుంది.
'వియ్ నీడ్ టు బిలీవ్ ఇన్ ద ఇంపాజిబుల్
అండ్ రిమూవ్ ద ఇంప్రాబబుల్'
... అంటూ ప్రఖ్యాత రచయిత ఆస్కార్‌వైల్డ్‌ను గుర్తుచేసుకున్నారు.
తనకు సంగీతమంటే ఇష్టం. బీటిల్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. క్రికెట్ అన్నా ప్రాణం. విద్యార్థి దశలో హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ జట్టులో ఆడారు. ఆరోజుల్లో జరిగిన ఓ సంఘటన తనకో విలువైన నాయకత్వ పాఠాన్ని నేర్పిందని ఇప్పటికీ చెబుతుంటారు...'ఓ మ్యాచ్‌లో ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్టూ పడలేదు. కెప్టెన్ నా పరిస్థితిని అర్థంచేసుకున్నట్టున్నాడు. తనే రంగంలో దిగి, బౌలింగ్ చేశాడు. వికెట్లు తీశాక మళ్లీ నాకు అవకాశం ఇచ్చాడు. నిజమైన నాయకత్వమంటే అదే. లీడర్ అన్నవాడు ముందుండి నడిపించాలి'.
'మన ఆలోచనలు నాలుగు గోడలకే పరిమితం కాకూడదు. బయట ఓ విశాల ప్రపంచం ఉంది. అక్కడేం జరుగుతోందో గమనించండి. యువతరం ఎలా ఆలోచిస్తుందో పరిశీలించండి, వాళ్ల అవసరాల్నీ అభిరుచుల్నీ అర్థంచేసుకోండి' అంటూ ఎగ్జిక్యూటివ్స్‌కు హితబోధ చేస్తుంటారు సత్య. యువ ఎంట్రప్రెన్యూర్స్‌తో సంభాషించడానికి ఆసక్తి చూపుతారాయన.
ప్రొఫైల్ :
పేరు ; నాదెళ్ళ సత్యనారాయణ చౌదరి. 46 సం.లు.
సొంతూరు : బుక్కాపురం ,యల్లనూరు మండలం (అనంతపురం జిల్లా),
కుటుంబం : భార్య : అనుపమ , ఇద్దరు కూతుళ్ళు , ఒక కొడుకు ,
చదువు : ఎలక్ట్రికల్ ఇంజనీర్ (మణిపాల్ ఇన్‌స్టి్ట్యూట్ ఒఫ్ టెక్నాలజీ) ఎం.ఎస్ (విస్కాన్‌సిన్ యూనివర్సిటీ-అమెరికా),ఎం.బి.ఏ. --షికాగో యూనివర్సిటీ(అమెరికా),
మిక్రోసాప్ట్ లో చేరిన సం: 1992.
* * *
మైక్రోసాఫ్ట్ సీయీవోగా బాధ్యతలు స్వీకరించగానే... ఉద్యోగులకు ఓ స్ఫూర్తిదాయకమైన మెయిల్ పంపారు సత్య. అందులో తన ఆలోచనల్నీ కలల్నీ పంచుకున్నారు.
ఆ ఉత్తరంలో 'నేను' అన్న అహానికి ప్రాధాన్యం లేదు.
'మనం' అన్న మాటను దాదాపు 36 సార్లు ఉపయోగించారు.
'ప్రపంచం' అన్న మాటను 13 సార్లు వాడారు.
ఓ భారతీయుడు 'గ్లోబల్ బిజినెస్ లీడర్'గా సాగిస్తున్న ప్రస్థానానికి...ఆ మెయిలే మైలురాయి!
- ======================
No comments:
Post a Comment