Sunday, September 4, 2011

ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ ,Mullapudi Harichandraprasad



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధి బాట చూపిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆంధ్రా షుగర్స్‌ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆంధ్రా బిర్లాగా పేరొంది రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఒక వూపు తెచ్చిన ఆయన వయసు 91 సంవత్సరాలు. ముళ్లపూడికి ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. మూత్రపిండాలు, హృద్రోగ సమస్యల కారణంగా ఆయన గత నెల 9న కేర్‌ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని తణుకులోని పాతూరులో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. ఆదివారం ప్రజల సందర్శనార్థం స్వగృహంలోనే ఉంచుతారు. ఆదివారం సాయంత్రంగానీ, సోమవారం ఉదయంగానీ అంత్యక్రియలు జరుగుతాయి.

పారిశ్రామిక విప్లవ కెరటం: కృషి, పట్టుదల, దీక్ష.. ఈ మూడు కలిస్తే ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌. తిమ్మరాజు, వెంకటరమణమ్మ దంపతులకు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పెదపట్నం గ్రామంలో జన్మించిన ఆయన తణుకులో ఫోర్త్‌ ఫోరం వరకూ చదివారు. 24 ఏళ్ల వయసులో 1947 ఆగస్టులో తణుకులో ఆంధ్రా షుగర్స్‌ పరిశ్రమను స్థాపించారు. అప్పట్లో జనసంచారంలేని ఆ ప్రాంతాన్ని పరిశ్రమ స్థాపనకు ఎన్నుకోవడం ఒక సాహసం. మొదట్లో రోజుకు 600 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో స్థాపించిన కర్మాగారం అంచెలంచెలుగా ఎదిగి 6 వేల టన్నులకు చేరేలా కృషి చేశారు. ప్రారంభంలో 350 మందితో ప్రారంభించిన ఆంధ్రా షుగర్స్‌ నేడు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి పథంలో మరింతగా సాగుతోంది. ఆ తర్వాత కాస్టిక్‌ సోడా, కాస్టిక్‌ పొటాష్‌, క్లోరిన్‌, హైడ్రోజన్‌ తయారీ ప్లాంటును 1960లో స్థాపించారు. సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌, సూపర్‌ ఫాస్ఫేట్‌ ప్లాంటులను 1960లో స్థాపించారు. 1984లో తణుకులోనే ర్యాకెట్‌ ఇంధన ప్లాంటును అప్పటి ఉప రాష్ట్రపతి శంకర్‌ దయాల్‌ శర్మ చేతుల మీదుగా ప్రారంభింప చేసి పారిశ్రామిక ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లారు. గుంటూరులో ఆయన నూనె గింజలు, బియ్యం, తవుడు ముడిపదార్థాలుగా తయారు చేసే నూనెలు, హైడ్రోజనేట్‌ అయిల్స్‌ తయారుచేసే ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆంధ్రా బిర్లాగా ప్రఖ్యాతి చెందిన డాక్టర్‌ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ పల్లెటూరి రైతువారీ పెద్దమనిషిగా, సాదాసీదాగా కనిపిస్తారు. 24 ఏళ్ల వయసులో ఆంధ్రాషుగర్స్‌ స్థాపించినప్పుడు ఆయన ఎంత ఉత్సాహంగా ఉండేవారో 91 ఏళ్ల వృద్ధాప్యంలోనూ అంతే ఆసక్తితో పని చేస్తూ వచ్చారు. హరిశ్చంద్రప్రసాద్‌ ఏక సమయంలో వివిధ ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య సంఘాలల్లో సభ్యులుగా కొనసాగుతూనే ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం: పారిశ్రామిక దిగ్గజంగా పేరుగాంచిన ముళ్లపూడి రాజకీయాల్లోనూ సేవలందించారు. మొదట్లో కాంగ్రెస్‌వాదిగా పేరొందిన ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉండగానే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 1955-67లో మధ్య రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తణుకు గ్రామ పంచాయతీ సర్పంచిగా పనిచేసిన ఆయన 1981లో తణుకు మున్సిపాల్టీగా ఏర్పడిన తర్వాత తొలి మున్సిపల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతర కాలంలో ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు.

ప్రజాసేవే పరమావధి: ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ కేవలం పారిశ్రామిక రంగానికే పరిమితం కాలేదు. తణుకులో ఆయన వివిధ సేవాకార్యక్రమాలు చేపట్టారు. పాలిటెక్నిక్‌ కళాశాల, ట్రస్ట్‌ ఆసుపత్రి, ముళ్లపూడి తిమ్మరాజు మెమోరియల్‌ లైబ్రరీ స్థాపించారు. రంగరాయ వైద్య కళాశాల ఏర్పాటులో ఆయన కృషి ప్రశంసనీయం. ధార్మికరంగంలో విజయవాడ తపోవనం, జూబ్లీహిల్స్‌లో శ్రీసీతారామస్వామి ధ్యాన మందిరం, భద్రాచలంలో సీతారామస్వామి దేవస్థానం, నరసాపురంలోని హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం, విశాఖపట్నం ప్రేమ సమాజం వంటి ధార్మిక సంస్థలకు ఆయన అధ్యక్షునిగా, పాలకమండలి సభ్యునిగా పనిచేసి ఆ సంస్థల ద్వారా పలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. తణుకు వెంకట్రాయపురంలో ముళ్లపూడి వెంకటరమణమ్మ స్మారక ఆసుపత్రి, కంటి ఆసుపత్రిని నిర్మించి ఎందరో పేదలకు వైద్య సేవలందిస్తున్నారు.
పలువురి సంతాపం: హరిశ్చంద్రప్రసాద్‌ మృతి సమాచారం తెలియగానే పలువురు ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుని సంతాపం తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, ముళ్లపూడి సమీప బంధువు, ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, ఆయన తనయుడు సురేష్‌బాబు, ఇతరులు ఆస్పత్రికి వచ్చారు. భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. 'రాష్ట్రంలో పారిశ్రామిక, విద్యారంగానికి ఎన్నో సేవలు అందించారు. భవిష్యత్తు తరాలకు ఆయన జీవితం ఓ స్ఫూర్తిదాయకం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నాను...' అని చంద్రబాబు పేర్కొన్నారు. ముళ్లపూడి భౌతికకాయాన్ని ఎంపీ కావూరి సాంబశివరావు, మంత్రి వట్టి వసంతకుమార్‌ సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ముళ్లపూడి మృతికి స్పీకరు నాదెండ్ల మనోహర్‌, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ, తెదేపా ఎంపీ హరికృష్ణ సంతాపం తెలిపారు. ముళ్లపూడి ఎంతో మందికి ఆదర్శమని, ఆయన మన మధ్య లేకపోవడం విచారకరమని భాజపా నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు నెల్లూరులో వ్యాఖ్యానించారు. ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ స్మృతిని సజీవం చేయడానికి ఆయన పేరిట ఒక అవార్డును నెలకొల్పాలని కాంగ్రెస్‌ నేత చిరంజీవి ప్రభుత్వాన్ని కోరారు.

Profile :
  • తల్లిదండ్రులు: తిమ్మరాజు, వెంకటరమణమ్మ
  • పుట్టింది: తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పెదపట్నం (తల్లి స్వగ్రామంలో)
  • పెరిగింది: పశ్చిమగోదావరి జిల్లా తణుకు
  • పుట్టిన తేదీ: 28.07.1921
  • విద్యార్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ
  • వివాహం: 1937 (16వ ఏట)
  • భార్య: చంద్రమతీదేవి, సంతానం: ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు
  • పారిశ్రామిక ప్రారంభం: 1947 ఆగస్టు 11న ఆంధ్రాషుగర్స్‌ స్థాపన
  • బాధ్యతలు: ఆంధ్రా షుగర్స్‌ ఛైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆంధ్రా పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌ ఎండీ, శ్రీఅక్కమాంబ టెక్స్‌టైల్స్‌, ఆంధ్రా కెమికల్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, హిందూస్థాన్‌ ఎలైడ్‌ కెమికల్స్‌, సత్యన్నారాయణ స్పిన్నింగ్‌ మిల్స్‌ ఛైర్మన్‌గా, గుజరాత్‌ రాష్ట్రం వల్లభనగర్‌లోని ఎమ్‌ఎస్‌ ఎలికాన్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ, హైదరాబాద్‌లోని ఆంధ్రా ఫౌండరీఅండ్‌మెషిన్స్‌ కంపెనీ డైరెక్టర్‌గా, నాబార్డు అగ్రిబిజినెస్‌ ఛైర్మన్‌గా...
అందుకున్న అవార్డులు
  • 1973: ఉత్తమ యాజమాన్య అవార్డు
  • 1981: అనకాపల్లి ప్రాంతీయ చెరకు పరిశోధన కేంద్రం చక్కెర కళాప్రపూర్ణ
  • 1985: ఉత్తమ సాంకేతిక అభివృద్ధి అవార్డు
  • 1991: ఇంధన పొదుపులో జాతీయ బహుమతి
  • 1992: ఉత్తమ మార్కెటింగ్‌ కంపెనీ అవార్డు



Source : Eenadu News paper 04/09/2011

  • ============================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment