- image : courtesy with Andhrapraba Telugu Newspaper.
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Deaths of Eminent persons-mystery?, ప్రముఖుల మరణాలు-రహస్యము?- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
ఎవరైనా జులుం చూపిస్తూ నియంతృత్వ వైఖరి ప్రదర్శిస్తే 'హిట్లర్' అని పేరు పెట్టేస్తాం. అంటే హిట్లర్ అనేది ఒక తిట్టుగా, నిందోక్తిగా మారింది. ఆ హిట్లర్ ఎవరో కాదు జర్మన్
రాజకీయవేత్త, నాజీ పార్టీ నాయకుడు, డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్. తన డిక్టేటర్‌షిప్‌తో ప్రజల్ని గడగడలాడించిన హిట్లర్ 1945లో పొటాషియమ్ సైనైడ్ మింగి తనువు
చాలించాడు.
జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కోవడం చేతకాని పిరికివారే ఆత్మహత్య చేసుకుంటా రనుకుంటాం. కానీ, ప్రపంచాన్నే భీతిల్లచేసిన హిట్లర్ బీరువుగా ఎలా మారాడు? ఏప్రిల్
30న హిట్లర్ తనను తాను అంతం చేసుకున్న రోజును పురస్కరించుకుని కొందరు ప్రముఖుల ఆత్మహత్యలను, అందుకు దారితీసిన సంఘటనలను పరిశీలిద్దాం.
అడాల్ఫ్ హిట్లర్ నాజీ జర్మనీ నియంత. 1934 నుంచి 1945 వరకూ నాజీ జర్మనీకి డిక్టేటర్‌గా గడగడలాడించాడు. హిట్లర్ ఎంత ఒణికించినా ఆయన ఒక అలంకారమే
అయ్యాడు. 1919లో జర్మన్ వర్కర్స్ పార్టీలో చేరడంతో అతని రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. రెండేళ్ళలో దానికి నాయకుడయ్యాడు. 1923లో మునిచ్‌లో 'బీర్ హాల్
పుచ్' పేరుతో ఆకస్మిక తిరుగుబాటు చేసినందుగ్గానూ జైలుపాలయ్యాడు. ఆ సమయంలో 'మై స్ట్రగుల్' పేరుతో తన చరిత్ర రాసుకున్నాడు. 1924లో ట్రీటీ వెర్సలైస్‌మీద
దాడి, ప్యాన్ జర్మనిజాన్ని సమర్థించడం, కమ్యూనిజాన్ని వ్యతిరేకించడం లాంటి అంశాలతో ఉత్తేజం కలిగించే ప్రసంగాలతో నాజీని సమర్థవంతంగా ప్రచారం చేసుకున్నాడు.
యూరప్‌ఖండంలో పూర్తి నాజీ జర్మన్ అధికారం రావాలనేది హిట్లర్ ఆశయం. అందుకోసం ఇంటాబయటా కూడా ముమ్మరంగా ప్రయత్నించి కృతకృత్యుడయ్యాడు.
1941లో హిట్లర్ సారధ్యంలో జర్మనీ దాదాపు యూరప్, ఉత్తర ఆఫ్రికా దేశాలన్నిటినీ ఆక్రమించుకుంది. 1943 నాటికి ఓటముల సంఖ్య పెరిగి తనను తాను
రక్షించుకోలేని దీన స్థితికి చేరింది. రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో.. అంటే 1945 ఏప్రిల్ 28న బెర్లిన్ యుద్ధ సమయంలో హిట్లర్ తన చిరకాల సహచరి ఇవా బ్రాన్‌ను
పెళ్ళి చేసుకున్నాడు. రెండంటే రెండురోజులు కూడా పూర్తికాకుండానే వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. రెడ్ ఆర్మీకి (సోవియట్ మిలట్రీ) పట్టుబడకుండా వుండేందుకు
1945 ఏప్రిల్ 30న హిట్లర్ తన భార్యతో కలిసి పొటాషియం సైనైడ్ సేవించాడు.
రెండో ప్రపంచయుద్ధానికి ప్రధాన కారణం విదేశీ విధానాలపట్ల హిట్లర్ వైపరీత్యమే. నాజీ దౌష్ట్యకాండ, హిట్లర్ దురహంకారాలు 55 లక్షలమంది ప్రాణాలను బలికొన్నాయి.
మరెన్నో లక్షలమంది ఆత్మన్యూనతలోపడ్డారు. ఇంత అనర్థానికి కారణమైన హిట్లర్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
క్లియోపాత్రా పూర్తిపేరు క్లియోపాత్రా 7 ఫిలొపేటర్. పురాతన ఈజిప్టు రాజపుత్రి. ఈజిప్టు పరిపాలనలో ఉన్న గ్రీకు కుటుంబ సభ్యురాలు. గ్రీకే కాకుండా రొజెట్టా స్టోన్ లాంటి
ఇతర ఈజిప్టు భాషలు కూడా అధికారికంగా చెల్లుబడి అయ్యేవి. అయితే క్లియోపాత్రా మాత్రం మన సంస్కృతభాషలా ఉన్నతంగా భావించే ఈజిప్షియన్ భాష మాట్లాడుతూ
ఈజిప్టు దేవతలా భాసిల్లేది.
క్లియోపాత్రా తండ్రితో కలిసి రాజ్యాన్ని పాలించింది. ఆనక ఈజిప్టు సంప్రదాయం ప్రకారం సోదరులను పెళ్ళాడి, వారితో కలిసి పరిపాలించింది. సోదరులతో ఆమెకు పిల్లల్లేరు.
క్రమంగా సొంతంగా పరిపాలనా బాధ్యతలు చేపట్టింది. జూలియస్ సీజర్‌తో ప్రేమబంధం సాగించి సింహాసనం మీద పటిష్టమైన పట్టు సాధించింది. క్రీస్తుకు పూర్వం 44లో
జూలియస్ సీజర్ హతమయ్యాక సీజర్ అతని వారసుడు మార్క్ ఆంటోనీతో కలిసి వుంది. అతనిద్వారా క్లియోపాత్రా సెలెన్2, అలెగ్జాండర్ హెలియస్ అనే కవలలు పుట్టారు.
ఆక్టియం యుద్ధంలో ఓడిపోవడంతో ఆంటోనీ ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో క్లియోపాత్రా సంప్రదాయాన్ని అనుసరించి కాలసర్పంతో కరిపించుకుని బలవన్మరణానికి
ప్రయత్నించింది. అయితే ఔషధాలతో ఆమెను కొద్దికాలం బ్రతికిచారు. ఆమెకెంతో మద్దతు ఇచ్చారు. కానీ, చివరికి ఆమె చనిపోయింది. ఈజిప్టు రోమన్ సామ్రాజ్యం కిందికి
వచ్చింది.
20వ శతాబ్దపు ప్రసిద్ధ ఆంగ్ల రచయిత్రి, ప్రచురణకర్త వర్జీనియా వూల్ఫ్. ఆమె 1882 జనవరి 25న పుట్టింది. అంతర్యుద్ధాలు జరుగుతున్న సమయంలో లండన్ లిటరరీ
సొసైటీలో ఆమె ప్రముఖవ్యక్తి. అలాగే మేధావుల 'బ్లూమ్స్‌బరీ' గ్రూపులోనూ ఎంతో ప్రభావితం చేస్తూ వుండేది. ఆమె రచనలు 'మిసెస్ డల్లోవే', 'టు ది లైట్‌హౌజ్', 'ఆర్లాండో'
నవలలు, 'ఎ రోమ్ ఆఫ్ వన్స్ ఓన్' వ్యాసాలు ప్రపంచప్రఖ్యాతిగాంచాయి. వర్జీనియాలో ఎంత భావ ఔన్నత్యం కనిపిస్తుందంటే 'స్త్రీ సాహితీ రచనలు చేయాలంటే ఆమెకంటూ
డబ్బుండాలి.. ఆమెకంటూ ఓ ఇల్లుండాలి' అన్న ఆమె మాటలు లోకోక్తిగా మారాయి. ఎంత అద్భుత భావం?! తానే మరొకరి అధీనంలో వుంటే ఇక ఆమె స్వతంత్రంగా ఏం
చెప్పగలదు?
వర్జీనియా ఊల్ఫ్ చివరి నవల 'బిట్వీన్ ది యాక్ట్స్'. ఆ రచన పూర్తికాగానే అంతకుముందులాగే మరోసారి డిప్రెషన్‌కు గురైంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ల బాంబుదాడి
ఫలితం ఆమె ఇంటిమీద కూడా పడింది. వర్జీనియా లండన్ నివాసం నాశనం కావడంతో ఆమె మనసు గాయపడింది. పనిచేయలేని స్థితిలో పడింది. దానికితోడు తన
దివంతగ స్నేహితురాలు రోజెర్ ఫ్రై జ్ఞాపకాలు వర్జీనియా పరిస్థితిని విషమం చేశాయి. 1941 మార్చి 28వ తేదీన వర్జీనియా ఓవర్‌కోట్ ధరించింది. దాని జేబులనిండా
రాళ్ళు నింపింది. తన ఇంటికి సమీపంలో ఉన్న ఔస్ నది చేరుకుని మరో ఆలోచన లేకుండా దూకేసింది. ఎంత విషాదమంటే ఆమె శవం మరో ఇరవై రోజులగ్గానీ దొరకలేదు.
ఆ సంవత్సరం ఏప్రిల్ 18న వర్జీనియా భర్త లియోనార్డ్ ఊల్ఫ్ దహనక్రియలు పూర్తిచేశాడు.
చనిపోయేముందు వర్జీనియా తన భర్తకు ఓ లేఖ రాసింది. దాని సారాంశం - ''డియరెస్ట్! నాకేం బాగాలేదు. మరోసారి పిచ్చిదాన్నయ్యాననిపిస్తోంది. ఇంకోసారి ఆ
దుర్భరత్వాన్ని అనుభవించలేను. ఈసారి కోలుకోలేను. నాకేవో భీకర స్వరాలు వినిపిస్తున్నాయి. దేనిమీదా ధ్యాస పెట్టలేకపోతున్నాను. ఎంత ఆలోచించినా
చనిపోవడంకంటే మేలైంది కనిపించడంలేదు. నువ్వు నాకెంతో చేశావు. ఇవ్వగలిగినంత ఆనందాన్నిచ్చావు. నీకంటే సంతోషాన్ని బహుశా ఇంకెవ్వరూ ఇవ్వలేరు. అయితే
ఇలాంటి దుర్భరవ్యాధితో ఏ ఇద్దరూ ఆనందంగా వుండలేరు. ఇంక ఈ నరకయాతనతో ఎంతమాత్రం యుద్ధంచేయలేను. నాకు తెలుసు.. నేను నీ జీవితాన్ని నాశనం
చేస్తున్నానని. కనుకనే నీకు దూరమౌతున్నాను. నేను లేకపోయినా నువ్వు పనిచేసుకోగలవు. కానీ, నేనలా కాదు, నువ్వు లేకపోతే నేను చదవలేను, రాయలేను, ఏమీ
చేయలేను. కనీసం ఈ ఉత్తరం కూడా సరిగ్గా రాయలేకపోతున్నాను. నా జీవితంలో ఉన్న డబ్బు, సంతోషాలన్నీ నీకే చెందుతాయి. నువ్వు చాలాచాలా మంచివాడివి.
ఎంతెంతో ఓర్పు చూపించావు. ఇది అందరికీ తెలుసు. నన్ను నువ్వు తప్ప వేరెవరూ కాపాడలేరు. నాది అనుకున్నదంతా పోయింది.. ఒక్క నీ మంచితనం తప్ప. నీ
జీవితాన్నింకా పాడుచేయడం ఇష్టంలేకనే ఇలా చేస్తున్నాను. మనం గడిపిన కంటే సంతోషకరమైన జీవితం బహుశా మరే జంటా గడిపి వుండదు.'
- ఇదీ వర్జీనియా ఊల్ఫ్ రాసిన సూయిసైడ్ నోట్. అపురూపమైన రచనలు చేసిన ఆమె మానసిక వ్యాధికి గురవ్వడం దుర్భరమే. స్త్రీ ఆత్మహత్య అనగానే భర్తతో సమస్యేమో
అని అపోహపడేవారుంటారు. అందుకు విరుద్ధంగా తన భర్త ఎంత ఉత్తముడో ఆమె స్వయంగా తెలియజేసింది. ఎందరో సైకియాట్రిస్టులు చెప్పినట్లుగా వర్జీనియా డిప్రెషనే
ఆమెని చనిపోడానికి పురికొల్పింది.
మన తారలు - ఆత్మహత్యలు
బాలీవుడ్‌లో ఎందరో నటీనటులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. 1960 డిసెంబర్ 2న పుట్టి 1996 సెప్టెంబర్ 23న
అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. సైడ్ యాక్ట్రెస్‌గా సినిమాల్లో ప్రవేశించి క్లబ్ డ్యాన్సర్‌గా స్థిరపడింది. 17 సంవత్సరాల్లో 450 చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ, కన్నడ,
మలయాళ, హిందీ భాషల్లో గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. సిల్క్‌స్మిత కారణంగా సక్సెసైన చిత్రాలున్నాయంటే అతిశయోక్తి కాదు. తన కెరీర్‌ను మార్చుకుని నిర్మాతగా
స్థిరపడాలనుకుంది. కానీ, ఆర్థిక సమస్యలు, ఆల్కహాల్‌కు ఎడిక్టవడం, ప్రేమ వైఫల్యం ఆమెని చుట్టుముట్టగా మద్రాసులో తన అపార్ట్‌మెంట్లో ఆత్మహత్య చేసుకుంది.
గ్లామరస్ నటి పర్వీన్‌బాబీ చివరిరోజుల్లో నిస్సహాయమైన ఒంటరిజీవితాన్ని గడిపింది. ఆమె చనిపోయిన మూడురోజులగ్గానీ బయటి ప్రపంచానికి ఆ సంగతి తెలియలేదు.
ఒకప్పుడు పర్వీన్‌బాబీ దర్శనం కోసం వందల వేల కళ్ళు పడిగాపులు కాసేవి. కానీ ఆఖరిరోజుల్లో ఆమెని పలకరించేవారు లేరు. ఆమె నివసిస్తోన్న జుహు రెసిడెన్సీలో
పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా చనిపోయి మూడురోజులైనట్లు తెలిసింది. అది సహజమరణం కాదని, ఆత్మహత్య అని భావించారు.
పదిహేనేళ్ళ వయసుకే సినిమాల్లో ప్రవేశించి పెద్ద హీరోల సరసన జోడీగా నటించి మెప్పించిన దివ్యభారతి 1993 ఏప్రిల్ 5న కేవలం 19 ఏళ్ళకే ఐదో అంతస్తు నుంచి దూకి
ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమె మద్యం సేవించి వుందని, వేరెవరో తోసేశారనే వాదం ఉన్నప్పటికీ చివరికి ఆత్మహత్య చేసుకుందనే నిర్ధారించారు. ఏమైనా
అంత చిన్న వయసులో హీరోయిన్‌గా మన్ననలు పొందిన నటి వేరొకరెవరూ లేరు. తెలుగులో వెంకటేష్, మోహన్‌బాబు, హిందీలో రిషీకపూర్, షారూఖ్‌ఖాన్ తదితరులతో
కలిసి నటించింది దివ్యభారతి.
'ప్యాసా' లాంటి ఉత్తమోత్తమ చిత్రాన్ని అందించిన గురుదత్ ఉద్ధండ నటుడు, దర్శకుడు. గురుదత్ 1964లో మోతాదు మించి స్లీపింగ్‌పిల్స్ మింగి ఆత్మహత్య
చేసుకున్నారు. అంతకుముందు కూడా రెండుసార్లు ఆయన సూయిసైడ్ ఎటెమ్ట్ చేశారుకానీ బ్రతికి బట్టకట్టారు. మూడోసారి ఆసుపత్రికి తీసికెళ్ళినా లాభంలేకపోయింది. ఓ
మహా నటుడు, మంచి దర్శకుడు 42 ఏళ్ళకే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించారు.
ఫటాఫట్ జయలక్ష్మి పుట్టింది తెలుగుదేశంలోనే. కె. బాలచందర్ 'అంతులేని కథ' చిత్రంలో 'ఫటాఫట్..' అనే డైలాగ్‌తో 'ఫటాఫట్' జయలక్ష్మిగా పాపులర్ అయిందామె.
తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకత చాటుకుంది. ఎన్.టి. రామారావు, రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, కృష్ణ లాంటి ప్రముఖ
హీరోలతో కలిసి నటించిన ఫటాఫట్ జయలక్ష్మి ఎం.జి.ఆర్ మేనల్లుణ్ణి పెళ్ళి చేసుకుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలను అధిగమించలేక ఫటాఫట్ జయలక్ష్మి
1980లో ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్య వైఫల్యాలు
ప్రిన్సెన్ డయానా రాకుమారే కాదు, చందమామ కథల్లో నాయికలా మహా అందకత్తె. 'పీపుల్స్ ప్రిన్సెస్' పేరుతో ఆమె జీవితచరిత్ర రాశారు ఆండ్య్రూ మార్టన్. అందులో
డయానా బల్మియా నెర్వొసా వ్యాధితో బాధపడినట్లు, ఐదుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు రాశారు. తాను గర్భవతిగా వుండగా భవనంమీదినుంచి దూకి
ఆత్మహత్యకు పాల్పడినట్లు డయానా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది కూడా. గొప్ప మానవతావాది అయిన డయానా జీవితం తీరని విషాదంతో కూడుకుని
వుండటం బాధాకరమనిపిస్తుంది.
ఎలిజిబెత్ టేలర్ ప్రస్తావన వస్తే ఇప్పటికీ మన కళ్ళు మెరుస్తాయి. అంత సౌందర్యరాశి చాలా అరుదుగా వుంటుంది. ఆమె జీవితంలో చాలా ఒడుదుడుకులున్నాయి. ఆమె
చాలా సన్నిహితంగా భావించే ఆత్మీయులు చనిపోయినప్పుడు డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్ విపరీతంగా సేవించడం చేసేది. అలాగే రిచార్డ్ బర్టన్‌తో తీవ్ర
విబేధాలు ఎదురైనప్పుడు స్లీపింగ్‌పిల్స్ మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అది విఫలమయ్యాక వారిద్దరూ విడిపోయి తిరిగి పెళ్ళిళ్ళు చేసుకున్నారు.
ఎమినెమ్‌గా ప్రాముఖ్యం సంపాదించిన మార్షల్ బ్రూస్ మాథర్స్ 3 ర్యాప్ మ్యూజిక్కి పెట్టింది పేరు. ఆయన సింగరు, రికార్డ్ ప్రొడ్యూసరు, నటుడు, గేయరచయిత కూడా.
తనదైన స్టైల్‌తో దూసుకుపోతున్న ఈ ర్యాప్ మ్యూజిషియన్ 2000 సంవత్సరంలో వరల్డ్ బెస్ట్ సెల్లింగ్ ఆర్టిస్టుగా కితాబులందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక పత్రికలు
అరుదైన కళాకారుల చిట్టాలో ఇతని పేరు వుంచుతూ గొప్పగా చిత్రించాయి. ఇతను గాళ్‌ఫ్రెండ్ పరాభవించిందనే బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ
కోలుకున్నాడు.
రాబర్ట్ మెక్ ఫార్లేన్ ఇరాన్ కాంట్రవర్సీ అపవాదుతో సిగ్గుపడే స్థితికి వెళ్ళడంతో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. గాయకుడైన ఎల్టన్ జాన్ గే మ్యాన్. తన శృంగార జీవిత
రహస్యాలు బయటపడ్డాయనే అవమానంతో బలవన్మరణానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అలాగే ఇరాన్ కుంభకోణంతో అపఖ్యాతి పాలైన రాబర్ట్ మెక్‌ఫార్లేన్, పాప్
ప్రపంచ రారాణి బ్రిట్నీ స్పేర్స్ పెళ్ళి ఫెయిలవడంతో రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినా బ్రతికి బట్టకట్టింది. హాలీవుడ్ మహానటి జూడీ గార్లెండ్ అనేకసార్లు
ఆత్మహత్యాయత్నం చేసి విఫలమైంది. వీరి దారిలో సంగీత సామ్రాట్టు శామీ డేవిస్ జూనియర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత హెల్లే బెర్రీ తదితరులెందరో ఉన్నారు.
ఆత్మహత్యలకు చాలాచాలా కారణాలున్నాయి. ఈగో ప్రాబ్లంతో చనిపోయేవారు కొందరు కాగా, తాము ఆశించిన జీవితాన్ని పొందలేక బలవంతంగా మరణిస్తున్నవారు
ఇంకొందరు. క్లినికల్ డిప్రెషన్‌తో సూయిసైడ్ చేసుకునేవారు కొందరు కాగా, కోపతాపాలతో క్షణికావేశంతో చనిపోయేవారు కొందరైతే ఆకస్మికంగా ఎదురయ్యే ఘోరమైన
నష్టాలను తట్టుకోలేక ప్రాణాన్ని పణంగా పెట్టేవారు కొందరు. ఊహించనివిధంగా రాజ్యాలు లేదా ఆస్తులు పోయినప్పుడు ఆ షాక్‌లోంచి తేరుకోలేక చనిపోయినవారున్నారు.
సంఘంలో ఘోరమైన పరాభవం ఎదురైతే తట్టుకోలేక చనిపోయేవారు కొందరు. ఆత్మీయులు అనుకున్నవాళ్ళు ద్రోహం చేస్తే అందులోంచి బయటపడలేక చావును
వెతుక్కుంటూ వెళ్ళేవారు ఇంకొందరు. సుదీర్ఘంగా బాధిస్తోన్న దుర్భరవ్యాధిని భరించలేక మరణాన్ని ఆహ్వానించేవారు మరికొందరు. ఆల్కహాలుకు బానిసలై ఆ మత్తు
చిత్తుచేసిన నేపథ్యంలో చనిపోయేవారు కొందరు. బలవన్మరణం పాలయ్యేవారిలో యువత ఎక్కువగా వుండగా వయసుమీరినవారు సెకెండ్ గ్రేడ్‌లో ఉన్నారు. కొన్ని దేశాల్లో
పురుషులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటుండగా, మరికొన్ని దేశాల్లో స్త్రీలు అధికసంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇది మానసిక
స్థితిగతుల కంటే పరిస్థితుల ప్రభావం అని తేలింది. నడి వయసు దాటిన మహిళలు ఎక్కువగా బలవంతపు చావుతో జీవితానికి స్వస్తి చెప్తున్నట్లు అధ్యయనాలు
తెలియజేస్తున్నాయి. ఆత్మహత్య చేసుకునేవారిని లేదా అందుకు ప్రయత్నించేవారిని దుర్బలులు అంటారు. కానీ గమ్మత్తేమిటంటే అలా చేసేవారిలో ఎక్కువమంది చాలా
తెలివైనవారట. ఇతర దేశాలతో పోల్చినప్పుడు అమెరికాలో ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య ఆరురెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. ఇతర రంగాలతో పోలిస్తే
రచయితలు, దర్శకులు, నటులు, గాయకులు ఇంకా ఇతర కళాకారులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా ఎక్కువని అర్థమౌతుంది.
ఆత్మహత్య అనేది వ్యక్తిగతమైంది, వారికి మాత్రమే సంబంధించింది. అయితే అందుకు దారితీసే కారణాలు ఆయా వ్యక్తులవల్ల ఎదురవ్వొచ్చు లేదా సామాజికమైనవి
కావొచ్చు. ఒక్కోసారి వారికి వారే సమస్య కూడా కావొచ్చు. అనేకమంది ప్రముఖులు తమమీద వచ్చిన గాసిప్స్‌ను జీర్ణించుకోలేక లేదా తాము చేసిన పనిని ఘోరంగా
ఎత్తిచూపగా దాన్ని లక్షలాదిమంది చూసి గేలిచేస్తారనే భయాందోళనతో మానసిక వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినవారూ ఉన్నారు. ప్రేమ వైఫల్యాలు, మరి
కొద్దిరోజుల్లో పెళ్ళనగా అది రద్దవడం, కట్నకానుకల సమస్య, భాగస్వామి లేదా వారి సంబంధీకులతో తలెత్తే గొడవలు, విడాకులు తీసుకోవడం, పెళ్ళికిముందు గర్భధారణ,
అక్రమసంబంధాలు - ఇలాంటి అనేక కారణాలతో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య ఎక్కువగా వుంది. దీన్నిబట్టి జీవితంలో ఇతర అన్ని విషయాలకంటే స్త్రీపురుషుల
సబంధాలు ప్రధాన భూమిక పోషిస్తాయని అర్థమౌతుంది.
ఎవరు ఆత్మహత్య చేసుకుంటారో ముందుగానే తెలిస్తే అలా జరక్కుండా నిరోధించవచ్చు. కానీ, అలా తెలీదు. మానసిక లేదా తీవ్ర శారీరక రుగ్మతలతో
బాధపడుతున్నవారు, నెగెటివ్ ఆటిట్యూడ్ ఉన్నవారు, పర్సనాల్టిd డిజార్డర్ ఉన్న వ్యక్తులు ఆత్మహత్య చేసుకునే అవకాశం వుంది. కొందరు తాత్కాలిక ఆవేశకావేశాలతో
ప్రాణం తీసుకుంటారు. ఉద్యోగం లేక ఆర్థిక సమస్యతో చనిపోయేవారు కొందరైతే వ్యాపారాల్లో ఊహించని నష్టాలొచ్చి చనిపోయేవారు ఇంకొందరు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షలకు పైగా ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. అందులో లక్షమంది భారతీయులే వుంటున్నారు. టీనేజ్ నుంచి 35 ఏళ్ళలోపువారు
ఎక్కువగా బలవన్మరణాలపాలవుతున్నారు. ఎక్కువమందిలో సాధారణ కారణం ఏమిటంటే సైకియాట్రిక్ డిజార్డర్. డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్, సిజోఫ్రెనియా, ఆల్కహాలిజం,
డ్రగ్ ఎబ్యూజ్ మొదలైనవన్నీ దీనికిందికే వస్తాయి. ఇక గన్నుతో కాల్చుకుని చనిపోయేవారి శాతం ఎక్కువ.
మనదేశంలో ఆత్మహత్య పెద్ద సమస్యగా పరిణమించింది. గత రెండు దశాబ్దాల్లో బలవన్మరణాల రేటు 7.9 నుంచి 10.3కి పెరిగింది. నిజానికి అభివృద్ధిపథంలో
పయనిస్తోన్న మనలో మార్పు రావాలి. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీరుల్లో ఆత్మహత్యల రేటు 3 కాగా, దక్షిణాది రాష్ట్రాలైన కేరళ,
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో దాని రేటు 15గావుంది.
హత్యే కాదు, ఆత్మహత్యా నేరమే. సహజ మరణమే తప్ప మనకు మనం చావును కొనితెచ్చుకోడానికి వీల్లేదు. ఆత్మహత్య చేసుకున్నవారు దయ్యాలుగా మారతారని చెప్పే
కథలున్నాయి. అవి పుక్కిటి పురాణాలనుకున్నా బలవన్మరణాన్ని నేరంగా పరిగణిస్తుంది ప్రభుత్వం. చావును ఆశ్రయించడాన్ని ఎవరూ సమర్థించరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ
(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రయత్నిస్తోంది. సూయిసైడల్ టెండెన్సీ గురించిన అవగాహన కలిగించేందుకు, అధ్యయనాలు జరిపేందుకు
ప్రయత్నిస్తోంది. స్లీపింగ్ పిల్స్ లాంటివి అందరికీ అందుబాటులో వుండకుండా చేయడం కూడా ఆరోగ్యసంస్థ లక్ష్యం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వుంటే తప్ప నిద్ర మాత్రలు
ఇవ్వకూడదనేది నిబంధన. అలాగే లైసెన్స్ వుంటే తప్ప, గన్ వుండడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత
ప్రభుత్వానిదే కాదు ప్రజలది కూడా. ఇందుకు సమిష్టి సహకారం, సలహాలు, సంప్రదింపులు, అంకితభావం అవసరం. ఇది సామాజిక బాధ్యత, కర్తవ్యం. ఓ వ్యక్తి మానసిక
వేదనకు గురైనప్పుడు కుటుంబసభ్యులు ఆ వ్యథను, బాధాతప్త హృదయాన్ని అర్థంచేసుకుని కుమిలిపోకుండా, కుంగిపోకుండా చేయగలిగితే సూయిసైడల్ టెండెన్సీ డెవొలప్
కాదని చెప్తున్నారు నిపుణులు. కొండంత విషాదమైనా కాస్తంత ఆత్మీయతతో కరిగిపోతుందట.
ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రముఖులు
మ్యాన్యుయేల్ అకునా - మెక్సికన్ పోయెట్ - 1996లో పొటాషియమ్ సైనైడ్ మింగి చనిపోయారు
రాబర్ట్ ఆడమ్స్ జూనియర్ - పెన్సిల్వేనియా కాంగ్రెస్‌మ్యాన్ - 1906లో స్టాక్‌స్పెక్యులేషన్ నష్టాలను తట్టుకోలేక తనను తాను కాల్చుకున్నారు--
ఎడ్విన్ ఆర్మ్‌స్ట్రాంగ్ - ఎఫ్ఫెమ్ రేడియో కనుగొన్న అమెరికన్ - 1954లో 13వ అంతస్తులో ఉన్న కిటికీలోంచి దూకి మరణించారు.
జోసెఫ్ బ్రూక్స్ - అమెరికన్ స్క్రీన్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ కంపోజర్ - 2011లో ఆత్మహత్య చేసుకున్నారు
క్లియోపాత్రా - క్రీస్తుకు పూర్వం ఈజిప్ట్ రాణి - పామును తనమీదికి ప్రేరేపించుకుని కరిపించుకుని చనిపోయింది.
ఎర్నెస్ట్ హెమింగ్వే - అమెరికన్ రచయిత, జర్నలిస్టు - 1961లో తలకు గురిపెట్టుకుని కాల్చుకుని చనిపోయారు.
వ్లాడిమర్ మయసోవ్‌స్కీ - రష్యన్ కవి - 1930లో కాల్చుకుని చనిపోయారు
లెంబిట్ ఆల్ - ఎస్టోనియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ - 1999లో భవనంమీది నుంచి దూకి చనిపోయారు
జెఫ్ ఆలమ్ ప్రఖ్యాత అమెరికన్ ఫుడ్‌బాల్ ఆడగాడు. ఇతను 1993లో షూట్ చేసుకుని చనిపోయాడు.
అలెగ్జాండర్ మెక్ క్వీన్ - బ్రిటిష్ ఫాషన్ డిజైనర్ 2010లో తన వార్డ్‌రోబ్‌లో ఉరి తీసుకుని చనిపోయాడు.
వర్జీనియా ఊల్ఫ్ - ప్రముఖ ఆంగ్ల రచయిత, 1941లో నీళ్ళలో దూకి చనిపోయారు
ప్రిన్స్ ఆల్‌ఫ్రెడ్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ - విక్టోరియా రాణి, యునైటెడ్ కింగ్‌డమ్, రష్యా జార్ అలెగ్జాండర్-2 ల మనవడు - 1899లో ఆత్మహత్య చేసుకున్నాడు
రాబర్ట్ క్లైవ్ - భారత్‌లో బ్రిటిష్ సామ్రజ్యాన్ని స్థాపించిన విజేత అనిపించుకున్న రాబర్ట్ క్లైవ్, 1774 నవంబర్ 22, కత్తితో గొంతు కోసుకుని చనిపోయాడు.
Sources :
http://www.medindia.net/patients/patientinfo/suicide_elder.htm
http://www.medindia.net/patients/patientinfo/suicide_rich.htm
http://en.wikipedia.org/wiki/Adolf_Hitler
http://en.wikipedia.org/wiki/List_of_suicides
http://www.medindia.net/patients/patientinfo/suicide_rich.htm
http://www.elistmania.com/juice/10_celebrities_who_attempted_suicide_but_were_unsuccessfu©«s/
http://www.listal.com/list/celebrities-who-attempted-suicide
--apr - Mon, 29 Apr 2013, IST
- ====================
No comments:
Post a Comment